ED Raids In Rayapati Sambasivarao Residence
ED Raids : ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా గుంటూరులో టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (RayapatiSambasivarao)ఇంట్లో ED (Enforcement Directorate) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా ఈడీ అధికారులు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. రాయపాటికి చెందిన ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలపై గతంలో కేసు నమోదు చేసింది. ఈక్రమంలో ఈ కేసు విచారణలో భాగంగా అటు ఏపీలోని గుంటూరు, ఇటు హైదరాబాద్ లోని రాయపాటి కార్యాలయాల్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ట్రాన్స్‌స్టాయ్ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లుగా సమాచారం.
అలాగే మాలినేని సాంబశివరాలు ( Malineni Sambasiva Rao)ఇంట్లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మాలినేని సాంబశివరావుకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేసినట్లుగా ఆరోపణలు రాగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.