dancer shobha naidu:ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి పద్మశ్రీ. డా. శోభా నాయుడు కన్నుమూశారు. ఆమె వయస్సు 64 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం అర్ధరాత్రి గం.1-44 లకు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గత కొంత కాలంగా ఆమె న్యూరోలాజికల్ సమస్యకు చికిత్స పొందుతున్నారు. 1956 లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు.
సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ కి ఆమె ప్రిన్సిపాల్‌గా పనిచేసారు.
ఆమె ఎంతో మంది పిల్లలకు కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చారు. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2001 లో శోభానాయుడును పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1998 లో ఎ న్టీఆర్, 1982 లో చూడామణి, 1991 లో సంగీత నాటక అకాడమీ అవార్డులు ఆమె అందుకున్నారు. శోభానాయుడు తన శిష్యబృందంతో పలు దేశాల్లో నృత్య ప్రదర్సనలు ఇచ్చారు.