Perni Nani
Perni Nani: తిరుమల లడ్డూ అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో బరితెగించి అపార్ధాలు మాట్లాడారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జంతువుల కొవ్వు అనగానే.. పవన్ పందికొక్కు, చేప కొవ్వు అని రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ ల దుర్మార్గాలను సీబీఐ చార్జిషీట్ తో కడిగేసిందన్నారు. జగన్ క్రిస్టియన్ అనే కదా మీ బరితెగింపు మాటలు..? అని మండిపడ్డారు.
హిందూ దేవాలయాలపై దాడి జరిగితే జగన్ కి రాజకీయ లబ్ధి వస్తుందా..? అని ప్రశ్నించారు. కిరాయి మూకలను పెట్టి దేవాలయాలపై దాడులు చేయించింది చంద్రబాబు మనుషులే అని పేర్నినాని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు చేయించింది మీరే కదా..? అని మండిపడ్డారు. గత టీడీపీ పాలనలో విజయవాడలో వందలాది దేవాలయాలను జేసీబీలతో కూలగొట్టేశారని పేర్నినాని అన్నారు. గెటప్ లు మార్చి దీక్షలు అంటూ హడావిడి చేసే పవన్ కల్యాణ్.. కాశీనాయన క్షేత్రాన్ని కూలగొట్టింది మీ శాఖ అధికారులే కదా..? అని నిలదీశారు.
వీళ్ళ పాపాల వల్ల దేవాలయాల్లో అమాయక భక్తులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా భక్తులు చనిపోతే చంద్రబాబు, పవన్ కనీసం ఆత్మ విమర్శ అయినా చేసుకున్నారా..? అని అడిగారు. మీరు కూల్చేసిన దేవాలయాలను, ధ్వంసం చేసిన రథాలను జగన్ పునర్నిర్మించారని పేర్నినాని తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ పై అనేక ఆరోపణలు చేశారు, ఇప్పుడు రెండేళ్లయినా ట్రస్ట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారు..? అని సీఎం చంద్రబాబుని పేర్నినాని అడిగారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారానే ఆలయాల పునర్నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. జగన్ ఆలోచన కూడా ఇదే అన్నారు. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 6064 కోట్లు ఖర్చు చేసి దేవాలయాల పునర్నిర్మాణం చేశామన్నారు. కూటమి పాలనలో ప్రస్తుతం టీటీడీ సహా దేవాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. భక్తులను నిలువునా దోపిడీ చేసేస్తున్నారు.. వీటిని కంట్రోల్ చెయ్యరా..? అని నిలదీశారు. దేవుడి పేరుతో జగన్ పై విషం చిమ్మడమే తప్ప భక్తులపై దోపిడీ ఆపరా..? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పేర్నినాని.
Also Read: రూటు మార్చిన జగన్? వైఎస్సార్ సన్నిహితులతో మంతనాలు అందుకోసమేనా?