Perni Nani (Photo Credit : Google)
Ttd Laddu Row : ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీమంత్రి పేర్నినాని తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు టార్గెట్ గా ఆయన నిప్పులు చెరిగారు. తిరుమల ప్రసాదాన్ని దుర్మార్గంగా తన రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కల్తీ నెయ్యిని ప్రసాదం తయారీలో వాడలేదని ఈవో శ్యామలరావు చెబుతున్నారని అన్నారు. కూటమి నేతలు తిరుమల లడ్డూని అపవిత్రం చేశారని ఆయన ధ్వజమెత్తారు. తిరుమల విశిష్టతను దెబ్బతీసిన కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పేర్నినాని వెల్లడించారు.
”లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, అలాంటి వాటితో చేసిన లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంచేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం సాక్ష్యాత్తు కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. తిరుమల పవిత్రను దెబ్బతీశారు. శ్రీవారి నైవేద్యమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయానికి వాడుకుంటున్నారు. పవిత్రమైన ఆలయాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ భక్తుల ఆరాధ్య దైవాన్ని కూడా రాజకీయాల్లోకి లాగారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వ్యవహరించారు.
లోపాలు ఉన్న నెయ్యిని మేము వెనక్కి పంపాము, ప్రసాదం తయారీలో దాన్ని వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుపతిలో ల్యాబ్ లో ఉంది, అక్కడ మేము పరీక్ష చేసి లోపాలున్న నెయ్యిని వాడకుండా వెనక్కి పంపేశాము అని చెబుతున్నా.. చంద్రబాబు ఎంతో దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందంటున్నారు. అసత్యాలు చెప్పడంలో నారా లోకేశ్ మరో 10 అడుగులు ముందుకేశారు. ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేశారు. దున్నపోతు ఈనితే దూడ కట్టేయడానికి ఎవడో పరిగెత్తినట్లుగా.. తండ్రీ కొడుకుల దుర్మార్గపు మాటలను తన భుజాన వేసుకుని ప్రచారం చేశారు పవన్ కల్యాణ్.
Also Read : తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం, కాలినడకన తిరుమలకు..
వీళ్లంతా కలిసి ఉమ్మడిగా, కూటమిగా చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి జగన్ పిలుపు మేరకు సెప్టెంబర్ 28న తేదీన అన్ని ఆలయాల్లో పూజలు చేస్తున్నాం. భక్తులు, ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలని అందరినీ కోరుతున్నాం. కూటమి నేతలు స్వామి వారి పవిత్రను దెబ్బతీసేలా పాపానికి ఒడిగట్టారు. వారి పాపాలను క్షమించి వదిలేయమని, అందుకు పరిహారంగా ప్రత్యేక పూజలు చేయాలని అందరినీ కోరుతున్నాం” అని పేర్నినాని అన్నారు.