విజయవాడలో వరద విలయం.. ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు

నీరు పూర్తిగా పోతే కానీ సహాయక చర్యలు చేసే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు.

Vijayawada Floods : విజయవాడలోని కబేళా సెంటర్, రామరాజ్య నగర్, సితార సెంటర్, ఊర్మిలా నగర్, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వారం రోజులుగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. నిత్యవసర వస్తువుల కోసం జనం అల్లాడిపోతున్నారు.

వారం రోజులుగా కబేళా సెంటర్ ప్రాంత వాసులు బుడమేరు వరద నీటి ముంపులోనే ఉన్నారు. నడుం లోతు వరకు నీరు ఉంది. జలదిగ్బంధం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు అందించాలని స్థానికులు వేడుకుంటున్నారు. నీరు పూర్తిగా పోతే కానీ సహాయక చర్యలు చేసే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. తాగు నీటి కోసం అల్లాడిపోతున్నారు. తాగు నీటి కోసం బకెట్లు పట్టుకుని వేడుకుంటున్నారు. నిత్యవసరాల కోసం కొందరు విలవిలలాడిపోతున్నారు. అటు ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు తోడేసినా.. మళ్లీ నీరు వచ్చి ఇంట్లోకి చేరుతోందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Also Read : విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే పడవలను వదిలారు : మంత్రి కొల్లు రవీంద్ర

అటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నా.. కొన్ని ప్రాంతాల వారికి అవి అందడం లేదని బాధితులు వాపోతున్నారు. వారం రోజులుగా నీరు ఉండిపోవడంతో మురికి వాసన వస్తోందని, దుర్గంధం భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక, ఇంట్లోని సామాగ్రి మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయిందని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రికి రాత్రికి కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నామన్నారు. వారం రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంటున్నామని, వరద నీటి నుంచి తమను బయటపడేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు