ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివ గణేశ్ కిడ్నాప్ కేసు, కొండారెడ్డి గన్ మెన్స్ అరెస్టు

  • Publish Date - October 8, 2020 / 12:32 PM IST

film distributor shiva ganesh : ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివ గణేశ్‌ కిడ్నాప్‌ కేసులో కొండారెడ్డి గన్‌మెన్లను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో శివగణేశ్‌ను బెదిరించిన తర్వాత ఇద్దరు ప్రభుత్వ గన్‌మెన్లు కడప చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని విచారించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు గన్‌మెన్లను 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.



మరోవైపు కొండారెడ్డి, అతని అనుచరుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. భూ వివాదంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌ కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. అసలు శివగణేశ్, మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి మధ్య గొడవ ఏంటి..? కిడ్నాప్ చేసేంతలా ఇద్దరి మధ్య ఏం జరిగింది..? బలవంతంగా శివగణేశ్‌ సంతకాలు తీసుకోవడానికి గల కారణమేంటి..? ఇంతకీ ఆ భూమి ఎక్కడుంది.. ఎవరి పేరు మీద ఉంది ?



కడప జిల్లా ప్రొద్దుటూరులో అగస్తేశ్వర దేవస్థానానికి చెందిన 18 ఎకరాల భూమిని 50 ఏళ్ల కిందట దేవరశెట్టి వెంకటపతి ఓ ట్రస్ట్ పేరిట కొనుగోలు చేశారు. ఆ స్థలంలో తన భార్య ఆదిలక్ష్మమ్మ పేరిట బాలికల, మహిళా కళాశాలలను ఏర్పాటు చేశారు. వీరికి సంతానం లేకపోవడంతో సత్యనారాయణను దత్తత తీసుకున్నారు. అయితే కళాశాల నిర్వహణ బాధ్యతలను సత్యనారాయణ అన్న అయిన శంభు ప్రసాద్‌కు అప్పగించారు. కళాశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కొంత స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించారు.



దేవస్థానానికి చెందిన భూమి కావడంతో ప్రభుత్వం అనుమతి తప్పనిసరైంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాంలో ప్రయత్నించినప్పటికీ పర్మిషన్ రాలేదు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రాను రాను కాలేజీ నిర్వహణ భారం కష్టంగా మారింది. దీంతో మిగిలిన 11 ఎకరాల స్థలాన్ని అమ్మి కాలేజీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అయితే అది దేవస్థానం నుంచి ట్రస్ట్ పేరు మీద కొనుగోలు చేయడంతో ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.



అప్పట్లో ఎంత ప్రయత్నించినప్పటికీ అనుమతి రాలేదు. దీంతో అప్పటికే ఆర్థికంగా ఓ స్థాయిలో ఉన్న శివగణేశ్‌ను శంభు ప్రసాద్ సాయం కోరాడు. జీవో, పర్మిషన్ తీసుకొస్తే 2.5 ఎకరాల స్థలం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
రంగంలోకి దిగిన శివగణేశ్‌.. అప్పటి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సాయం కోరాడు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొస్తే తనకొచ్చే రెండున్నర ఎకరాల్లో ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డికి ఎకరం స్థలం ఇస్తానని మాటిచ్చాడు.



దీంతో ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి ప్రయత్నించినప్పటికీ.. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాంలో ఎలాంటి అనుమతులు రాలేదు. చివరగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రస్ట్ భూమి విక్రయించేలా అనుమతులు సంపాదించారు.



11 ఎకరాల స్థలాన్ని 6.97కోట్లకు శంభుప్రసాద్ అమ్మేశాడు. ఒప్పందం ప్రకారం శివగణేశ్‌కి రెండున్నర ఎకరాల భూమిని రిజిస్ట్రర్ చేశారు. అయితే శివగణేశ్‌ మాత్రం ఎమ్మెల్యే వరదరాజుల కొడుకు కొండారెడ్డికి ఇస్తానన్న ఎకరం స్థలం మాత్రం ఇవ్వలేదు. దీంతో అప్పటినుంచి ఇద్దరి మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఆ భూమి కోట్లు విలువ చేస్తుండడంతో.. ఎలాగైనా తన వాటా దక్కించుకోవాలని కొండారెడ్డి ప్లాన్ వేశాడు.



హైదరాబాద్‌ వచ్చిన కొండారెడ్డి, అతని అనుచరులు.. మాట్లాడుదామని పిలిచి శివగణేశ్‌ను బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. రెండున్నర ఎకరాల భూమి పత్రాలపై సంతకాలు తీసుకెళ్లి శివగణేశ్‌ను వదిలేసి పరారయ్యారు. అయితే తనను కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కొండారెడ్డిపై శివగణేశ్‌ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొండారెడ్డి, అతని అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.