Gudivada Crown Missing Case: గుడివాడ వేంకటేశ్వర స్వామి కోటి రూపాయల కిరీటం కథ సుఖాంతం..
తొలుత కిరీటాన్ని తాకట్టు పెట్టలేదని కమిటీ సభ్యులు బుకాయించారు. కిరీటం వ్యవహారం మా కుటుంబ సమస్య, మీడియాకు సంబంధం లేదు అంటూ కమిటీ సభ్యులు దౌర్జన్యానికి దిగారు.
- Naveen
- Updated on- May 22, 2026 / 07:55 PM IST
Gudivada Crown Missing Case: కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కి వచ్చింది. తాకట్టు వ్యాపారి నుంచి కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటాన్ని దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు విడిపించారు. ఆర్యవైశ్య కళ్యాణ మందిర ప్రాంగణంలో మీడియా ముందు కిరీటాన్ని ప్రదర్శించారు కమిటీ సభ్యులు. శనివారం కిరీటానికి సంప్రోక్షణ చేసి దాతల సమక్షంలోనే స్వామి వారికి అలంకరిస్తామని కమిటీ సభ్యులు ప్రకటించారు.
తొలుత స్వామి వారి బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టలేదని కమిటీ సభ్యులు బుకాయించారు. అయితే, రాజేంద్ర అండ్ బ్రదర్స్ షాప్ యజమాని రాజేంద్ర కొఠారి దగ్గర స్వామి వారి కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లుగా మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపించడంతో షాక్ తిన్నారు. అయితే, కిరీటం వ్యవహారం మా కుటుంబ సమస్య, మీడియాకు సంబంధం లేదు అంటూ కమిటీ సభ్యులు దౌర్జన్యానికి దిగారు. భక్తుల మనోభావాల గురించి ప్రశ్నించడంతో మీడియాపై దాడికి కూడా యత్నించారు.
వైశ్య సంఘాల పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. కళ్యాణ మందిర నిర్మాణ నిధుల కోసమే కిరీటం తాకట్టు పెట్టినట్లు కమిటీ చైర్మన్ పోకూరి మోహనరావు అంగీకరించారు. తప్పు జరిగిందని ఆయన ఒప్పుకున్నారు. తనను మన్నించాలని కోరారు. దాత కుటుంబంతో మాట్లాడి కిరీటం స్వామి వారికి అలంకరిస్తామని చైర్మన్ వెల్లడించారు. జరిగిన తప్పును ఇక్కడితో వదిలేయాలని ఆలయ కమిటీ చైర్మన్ మోహనరావు విజ్ఞప్తి చేశారు.
Also Read: విజయవాడ థార్ జీపులతో స్ట్రీట్ ఫైట్ కేసులో సంచలన విషయాలు..
