Chintada Ravi Kumar: వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్.. కూటమి సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చింతాడ రవి కుమార్(Chintada Ravi Kumar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ysrcp leader chintada ravi kumar detained by police in srikakulam
- పోలీసుల అదుపులో చింతాడ రవికుమార్
- లొంగిపోయేందుకు వెళ్తుండగా అరెస్ట్
- మంత్రి నారా లోకేష్‌పై ఆరోపణలు
Chintada Ravi Kumar: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులపై విచారణ పేరుతో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని, వారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు స్వయంగా వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని రవికుమార్ వెల్లడించారు. సమాచారం ఇచ్చి వెళ్తున్నప్పటికీ మార్గమధ్యంలో బలవంతంగా వేరే వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారని, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదని ఆరోపించారు.
న్యాయపోరాటం చేస్తుంటే అక్రమ అరెస్టులా?
విచారణ పేరుతో నిత్యం పోలీసులు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వేధిస్తున్నారని, దాదాపు 50 నుంచి 60 మంది పార్టీ క్యాడర్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొందని చింతాడ రవికుమార్(Chintada Ravi Kumar) ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నామని, కేసు కోర్టు పెండింగ్‌లో ఉండగానే మహిళలు, యువతను తీసుకెళ్లి భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు చేస్తున్నట్లు కనీస సమాచారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టేనని విమర్శించారు.
