Konijeti Rosaiah No more: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.. కన్నుమూశారు. నిద్రలోనే ఆయనకు గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం విడిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. నిద్రలోనే ఆయనకు గుండెపోటు రాగా.. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. అంతలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. రాజకీయ చాణక్యుడిగా పేరు గాంచిన రోశయ్య.. శాసనమండలి సభ్యుడిగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఆర్థిక మంత్రిగా.. ముఖ్యమంత్రిగా అసమాన రీతిలో ప్రజలకు సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ కష్ట కాలంలో ఉన్న సమయాల్లో.. ముందుండి సమస్యలు ఎదుర్కొన్నారు.

ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన రోశయ్య.. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్థంగా సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గానూ పని చేశారు. పేరుకు కాంగ్రెస్ నేత అయినా.. రోశయ్యకు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. ఆయా పార్టీల నేతలంతా.. రోశయ్య మరణంపై తీవ్ర ఆవేదన, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రేపు మధ్యాహ్నం రోశయ్యకు హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి మృతిపై.. 3 రోజుల పాటు సంతాపదినాలుగా వ్యవహరించనున్నట్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు