Pensions AP Cabinet Decisions
AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడున్నర గంటల పాటు మంతివర్గం సమావేశం సాగింది. 55 అంశాల అజెండాగా ఈ భేటీ నడిచింది. ధ్రువపత్రాలు ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. విశాఖలో రూ.2,387 కోట్లతో నిర్మించే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఆమోదం తెలిపింది. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు కొత్త శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి, చీరాల, రాజమండ్రిలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మరోవైపు ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మార్చి 1న ఆదివారం ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండటంతో ఈనెల 28నే పెన్షన్లు అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు.
క్యాబినెట్ భేటీలో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ప్రతీరోజూ పరీక్షగానే భావించాలన్నారు. ప్రభుత్వం చేసే పని క్షేత్రస్థాయికి చేరాలన్నారు. మంత్రులు, కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విపక్షం నిర్మాణాత్మకంగా ఉండాల్సిందిపోయి రాజకీయాలు చేస్తోందని, అసెంబ్లీకి రాకుండా బయట బురద రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏడాదిపాటు ఊళ్లలో తిరిగి చేసే కార్యక్రమాలు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడితే సరిపోతుందన్నారు.
మంత్రులు శాఖల్లో చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడినట్టే అని చంద్రబాబు అన్నారు. ఈ నెల 28న సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్నందున అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని నిర్ణయించామన్నారు. ఫింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు కచ్చితంగా పాల్గొనాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాల ఎలా ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విశ్లేషణ చేయిస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. హెరిటేజ్ తో పాటు 10 సంస్థల విస్తరణకు భూ కేటాయింపులపై కేబినెట్ లో చర్చ జరిగింది. హెరిటేజ్ కు భూ కేటాయింపు చర్చ సమయంలో మంత్రివర్గ సమావేశం నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బయటకు వెళ్లిపోయారు.