శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మరువకముందే… రాజాంలో మరో బాలిక మంటల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. ఇంటి దగ్గర్లోని ఖాళీ ప్రదేశానికి బహిర్భూమికి వెళ్లిన బాలిక మంటల్లో చిక్కుకుంది. స్థానికులు వచ్చి మంటల్ని అదుపు చేశారు. అప్పటికే 90శాతం శరీరం కాలిపోయింది. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా… వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు.
రాజాం జూనియర్ సివిల్ జడ్జి స్వాతి వచ్చి బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి తనపై పెట్రోల్ పోసి నిప్పటించారని బాలిక వాంగ్మూలం ఇచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రాజాంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో బాలిక ఏడో తరగతి చదువుతోంది.
నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లిన ఆమె… మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చింది. సాయంత్రం సమీపంలోని ఖాళీ ప్రదేశంలోకి బహిర్భూమికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంలో మంటలతో పాటు బాలిక కేకలు వినిపించడంతో సమీపంలో ఉన్నవారు వెళ్లి మంటల్ని ఆర్పేశారు.
అప్పటికే ఆమె శరీరమంతా కాలిపోయింది. ఆ బాలిక తమ కుమార్తేనని తల్లిదండ్రులు గుర్తించారు. కన్నీరు మున్నీరవుతూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యా ప్రయత్నేమనని ఆరోపిస్తున్నారు.
అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తరచూ వేధించేవారని చెప్పారు. ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసినా పట్టించుకోలేదన్నారు. సహచర విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.
Read More : కరోనా ఎఫెక్ట్ : యాపిల్‌కు దెబ్బ