Flood-affected Residents : ఎత్తైనా కొండలే ఆవాసాలుగా…. ముంపు బాధిత నిర్వాసితుల కష్టాలు

గోదావరిలో వరద ఉదృతి పెరుగుతుండటంతో ముంపు బాధిత నిర్వాసితులు ప్రత్యామ్నాయం వైపు కదులుతున్నారు. గ్రామాలకు సమీపంలోనే ఎత్తైన కొండలపై తాత్కాలిక పాకలు నిర్మించుకుని అవాసాలను ఏర్పరుచుకుంటున్నారు...

Godvari flood-affected residents : గోదావరిలో వరద ఉదృతి పెరుగుతుండటంతో ముంపు బాధిత నిర్వాసితులు ప్రత్యామ్నాయం వైపు కదులుతున్నారు. ఇప్పటికే చాలామంది అసంపూర్తిగా ఉన్న పునరావాస కేంద్రాలనే తాత్కాలిక ఆవాసాలుగా చేసుకోగా మరికొందరు మాత్రం ఇప్పుడు గ్రామాలకు సమీపంలోనే ఎత్తైన కొండలపై తాత్కాలిక పాకలు నిర్మించుకుని ఆవాసాలను ఏర్పరుచుకుంటున్నారు.

మరోవైపు రోజుల తరబడి వరద నిలిచిపోతే బయటకువచ్చేందుకు వీలుగా ముందుగానే కంపచెట్లను తొలగించి దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో కంటే వరద ఉద్ధృతంగా అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా ప్రవహిస్తుండటం, గోదావరిలో ఇంజిన్‌ పడవలపై ప్రయాణం క్లిష్టమయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయలు వెతుకుతున్నామని నిర్వాసితులు చెబుతున్నారు.

పోలవరం నుంచి 36 కిలోమీటర్ల దూరంలోని సిరివాక, కొరుటూరు, శివగిరి గ్రామాలవారు గెడ్డపల్లి మీదుగా రాకపోకలకు డాసన్‌ రోడ్డు ఉంది. గతంలో నిర్వాసితులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగించారు. అధికారులు నిత్యావసరాలను ట్రాక్టర్లపై ఈ మార్గంలోనే తరలించారు. ఇక చీడూరు, టేకూరు గ్రామాల వారు తవ్వు కాలువను పడవపై దాటి అక్కడి నుంచి వాడపల్లి, పెద్దూరు, గాజులగొంది, తల్లవరం మీదుగా ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించారు. ప్రస్తుతం ఆ మార్గం తుప్పలతో మూసుకుపోవడంతో వందలాది మంది గిరిజన యువతీ, యువకులు చెట్లను తొలగించి బాట వేసే పనిలో ఉన్నారు.

పోలవరం మండలం 19 ముంపు గ్రామాల పరిధిలోని 3,311 కుటుంబాలకు ఇప్పటివరకు సుమారు 900 కుటుంబాల వారు పునరావాస కాలనీలకు వెళ్లారు. మిగిలిన వారంతా స్థానికంగానే ఎత్తేన కొండలపైనే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు