AP Govt Scholarship : ఏపీలో డిగ్రీ చదివే అమ్మాయిలకు శుభవార్త.. ఉచితంగా ప్రతీయేటా రూ.30వేలు.. ఐదేళ్ల వరకు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Azim Premji Scholarship 2026 : ఏపీలో డిగ్రీ చదివే విద్యార్థినులకు శుభవార్త. అమ్మాయిల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.

Azim Premji Foundation scholarship

Azim Premji Scholarship 2026 : ఏపీలో డిగ్రీ చదివే విద్యార్థినులకు శుభవార్త. అమ్మాయిల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. రాష్ట్రంలో డిగ్రీ చదివే అమ్మాయిలు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకుంటే.. అర్హత కలిగిన వారికి ఏడాదికి రూ.30వేలు స్కాలర్ షిప్ అందించనుంది. అయితే, ఇందుకోసం కొన్ని నిబంధనలు విధించింది.

Also Read : AP Govt : ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం

2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ లేదంటే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థినులు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అందించే రూ.30వేల స్కాలర్ షిప్ కు అర్హులు. అయితే.. వీరు 10వ తరగతి, ఇంటర్‌లను ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యను పూర్తి చేసి ఉండాలి. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీల్లో చదివిన వారు ఈ స్కాలర్ షిప్ కు అనర్హులు.

ఏదైనా గుర్తింపు కలిగిన ప్రభుత్వ లేదంటే ప్రైవేట్ కళాశాల లేదంటే యూనివర్శిటీలో సాధారణ డిగ్రీ లేదంటే ప్రొఫెషనల్ కోర్సు లేదా డిప్లొమా కోర్సులో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి. ఈ స్కాలర్ షిప్‌ను విద్యార్థినులు చదివే కోర్సుకు తగిన విధంగా రెండు నుంచి ఐదేళ్ల వరకు అందిస్తారు. స్కాలర్ షిప్ మొత్తం విద్యార్థిని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

అర్హులైన విద్యార్థినులు ఆగస్టు 31వ తేదీ వరకు తొలి విడతగా.. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చు. azimpremjifoundation.org వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే క్రమంలో అభ్యర్థి కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటోలు. 10వ తరగతి మార్కుల మెమో, 12వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్‌కాపీ జత చేయాల్సి ఉంటుంది. అయితే, కేవలం మార్కుల ఆధారంగా ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక చేయరు.. విద్యార్థినుల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్‌లకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హత కలిగిన అమ్మాయిలు ఈ స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకొనేలా అవగాహన కల్పించాలని, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.