Google Data Center : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. విశాఖలో పట్టాలెక్కనున్న గూగుల్ డేటా సెంటర్.. శంకుస్థాపనకు డేట్ ఫిక్స్..
Google Data Center : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతుంది. ఈనెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
- Harishth Thanniru
- Published On : April 7, 2026 / 01:26 PM IST
Google Data Center
- ఈనెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
- ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ
- హాజరుకానున్న గూగుల్ క్లౌడ్ సీఈవో, ప్రముఖులు
Google Data Center : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతుంది. విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల వేదికగా టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నిర్మించ తలపెట్టిన భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. ఈనెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తోపాటు సంస్థకు చెందిన పలువురు ప్రముఖులుసైతం హాజరుకానున్నారు.
Also Read : Gold and Silver prices fall : యుద్ధం వేళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి..? అసలు కారణాలివే..
గూగుల్ సంస్థ సుమారు 1.35లక్షల కోట్లు పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఏకైక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబోతోంది. విశాఖపట్టణం జిల్లాలోని అడవివరం ప్రాంతాల్లో 160 ఎకరాల్లో, తార్లువాడలో 266 ఎకరాల్లో, అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో 174.80 ఎకరాల్లో గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యం ఉన్న మూడు డేటా సెంటర్లను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. వీటిని 2028 జులై నాటికి పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది.
గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ గత ఏడాది అక్టోబర్ 14న ఎంవోయూపై సంతకాలు చేశాయి. అవసరమైన భూమిని ప్రభుత్వం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించింది. మూడు డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. దీనికోసం 601.40 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది.
విశాఖపట్టణం తీర ప్రాంతం కావడంతో ఇక్కడి నుండి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు సముద్రగర్భ కేబుల్ వ్యవస్థల ద్వారా నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల విశాఖ నగరం అంతర్జాతీయ డేటా కనెక్టివిటీ ప్రధాన కేంద్రంగా మారనుంది.
