AP Rajya Sabha Quota: ఏపీ కోటా రాజ్యసభ సీట్ల రేసులో ట్విస్టులు..! ఆశావహుల లిస్ట్‌లో తెరపైకి ఊహించని పేర్లు..!

జనసేనలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ పేరు జోరుగా వినిపిస్తున్నా ఆశ్చర్యకరంగా ఒక ప్రముఖ తెలుగు నిర్మాత పేరు కూడా ముందుకు వస్తోంది.

  • Published on- April 14, 2026 / 11:09 PM IST
  • క్లైమాక్స్‌లో ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా?
  • టీడీపీ కోటాలో ఆ రెండు సీట్లు దక్కేదెవరికి?
  • బీజేపీకి దక్కే ఒక్క సీటును ఆశిస్తున్న నేతలెవరు?
  • జనసేన నుంచి పెద్దల సభకు వెళ్లేది ఆయనేనా?

AP Rajya Sabha Quota: నాలుగు సీట్లు. ఏపీలో రాజ్యసభ రేసు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ. వచ్చే నెలలో ఆ నాలుగు సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇంకేముంది ఆశావహులు లాబీయింగ్ స్పీడప్‌ చేయగా..కూటమి పార్టీలు కసరత్తును కంప్లీట్‌ చేసే బిజీలో ఉన్నాయి. అయితే ఆల్‌మోస్ట్‌ బెర్తులు కన్ఫామ్ అయినట్లు ఆ మధ్య వార్తలు రాగా..లాస్ట్ మినిట్‌లో కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందట. క్లైమాక్స్‌లో ట్విస్టులతో రాజ్యసభ రేసు ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారే సీన్ కనిపిస్తోంది.

రాజ్యసభ రేసు..కూటమి పార్టీల్లో ఆసక్తి రేపుతోంది. నెల రోజుల క్రితమే దేశంలో పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు భర్తీ అయ్యాయి. ఏపీ కోటాలో జూన్‌లో ఖాళీ కాబోతున్న నాలుగు సీట్లను మే నెలలో భర్తీ చేయనున్నారు. ఇంకో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో కూటమి పార్టీల్లో ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రాజ్యసభ అన్నది పెద్దల సభ. ఒక్కసారి బెర్త్ దక్కితే ఆరేళ్ల పాటు పదవిలో ఉండొచ్చు.

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి టీడీపీకి చెందిన సానా సతీష్ సీటు కాగా..వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ పదవీకాలం ముగుస్తుంది. ఏపీ అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమికే..నలుగురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుని పంపే చాన్స్ ఉంది. దాంతో నాలుగు సీట్లలో చోటు దక్కేదెవరికి అన్నది వాడీవేడి చర్చగా సాగుతోంది.

నాలుగు రాజ్యసభ సీట్ల కోసం ఇప్పటిదాకా ఎందరో పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాళ్లతో పాటు ఇప్పుడు మరికొందరి పేర్లు చర్చలోకి వస్తున్నాయి. టీడీపీలో అయితే గట్టి పోటీ ఉంది. నాలుగు సీట్లలో టీడీపీ రెండు తీసుకుంటుందని మిత్రులైన జనసేన, బీజేపీకి చెరి ఒకటి ఇస్తుందని అంటున్నారు. టీడీపీలో ఒక పోస్టు సానా సతీష్‌కే రెన్యూవల్ చేస్తారని మొన్నటిదాకా చర్చ జరిగింది. కానీ టీడీపీకి దక్కే రెండు పోస్టులకు కొత్త వారే వస్తారని మరో ప్రచారం ఊపందుకుంది.

రేసులోకి గల్లా, కృష్ణ ఎల్లా, చింతకాయల విజయ్..

గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో మంచి పలుకుబడి ఉన్న యంగ్ లీడర్‌ కావడంతో ఆయన సేవలను వాడుకోవాలని పార్టీ భావిస్తోందట. భారత్ బయోటెక్ చీఫ్ కృష్ణ ఎల్లా పేరు ప్రచారంలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇక సీనియర్ నేతలైన యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య పేర్లు రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ఇక యువ నాయకుల జాబితాలో చింతకాయల విజయ్‌కి కూడా రాజ్యసభ సీటు దక్కే సీన్ ఉందని అంటున్నారు. మహిళా నేతల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి.

జనసేనలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ పేరు జోరుగా వినిపిస్తున్నా ఆశ్చర్యకరంగా ఒక ప్రముఖ తెలుగు నిర్మాత పేరు కూడా ముందుకు వస్తోంది. ఇక బీజేపీ కోటాలో ఏపీ నుంచి నామినేట్ అయ్యే వారిలో ముందు పేరు తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా రాజ్యసభ సీటు కోసమేనని అంటున్నారు. ఆయనను పెద్దల సభకు పంపించి కేంద్రమంత్రిని చేసి తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. అయితే వైసీపీ నుంచి రిటైర్ అవుతున్న పరిమళ్ నత్వానీకి బీజేపీ కోటాలో రెన్యూవల్ ఉండొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పట్లో బీజేపీ సిఫార్సుతోనే పరిమళ్ నత్వానీ వైసీపీ నుంచి ఎంపీ అయ్యారని గుర్తు చేస్తున్నారు.

ఇంకా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఓవరాల్‌గా రాజ్యసభ రేసులో క్లైమాక్స్‌లో ట్విస్టులు ఉండే చాన్సెస్ లేకపోలేదంటున్నారు. ఎవరూ ఊహించని వారికి..రాజ్యసభ ఎంట్రీ ఉంటుందేమోన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఏపీ కోటాలో పెద్దల సభకు వెళ్లే అదృష్టవంతులెవరో వేచి చూడాలి.

Also Read: డీలిమిటేషన్ మంటలు.. మాకు అన్యాయం చేయొద్దు అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ