Chandrababu Pawan: ఒకే మాట, ఒకే నిర్ణయం.. సంక్షేమం అయినా, చట్టపరమైన చర్యలైనా.. ఆయన చెప్పారంటే.. ఈయన చేస్తారంతే..!

పరస్పరం అభిప్రాయాలను గౌరవించడం.. అప్పుడప్పుడు ప్రశంసించడం.. బంధాన్ని కలకాలం నిలిపేది ఇదే ! రాజకీయానికి కూడా పక్కాగా.. (Chandrababu Pawan)

Chandrababu Pawan: నేతలు ఇద్దరైనా.. నిర్ణయం మాత్రం ఒకటే ! పొత్తు ధర్మం విలువ చెప్తూ.. ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం, విలువ ఇస్తూ.. ఏపీలో పాలనను ముందుకు నడిపిస్తున్నారు. ఆయన ఓ సూచన చేస్తారు.. ఈయన వెంటనే ఆదేశిస్తారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకుంటూ.. ప్రజలకు అవసరమైన నిర్ణయాలను కలివిడిగా తీసుకుంటూ.. పాలనలో దూసుకుపోతున్నారు. రెండు పార్టీల కేడర్‌కు అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నారు.

కూటమి సర్కార్‌లో కలివిడిగా టీడీపీ, జనసేన..
పరస్పరం అభిప్రాయాలను గౌరవించడం.. అప్పుడప్పుడు ప్రశంసించడం.. బంధాన్ని కలకాలం నిలిపేది ఇదే ! రాజకీయానికి కూడా పక్కాగా సరిపోయే మాట ఇది. ఏపీలో కూటమి పార్టీల తీరు కూడా ఇప్పుడు ఇలానే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్‌ తీరు.. కేడర్‌కు అద్భుతమైన సందేశాన్ని పంపించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించడమే కాదు. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు కూడా కలివిడిగా తీసుకుంటున్నారు. చంద్రబాబు సూచనలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇక అటు పవన్ కల్యాణ్ చెప్పిన సూచనలను చంద్రబాబు కూడా పక్కాగా ఫాలో అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఏపీ కేబినెట్ భేటీలో ఇలాంటి ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

చాలా మంచి సూచన అని చంద్రబాబు ప్రశంస..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా.. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సజెషన్ ఇచ్చారు. దీనికి చంద్రబాబు ఫిదా అయ్యారు. అది చాలా మంచి సూచన అని ప్రశంసించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రివర్గ సమావేశంలో చాలా విషయాలపై మంత్రులు చర్చ జరిపారు. ఈ సందర్భంగా నాలా చట్ట సవరణ పైనా చర్చ జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్.. కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో వ్యవసాయం చేసే సాగు భూమిని వ్యవసాయేతరంగా.. అంటే ప్లాట్లు, వాణిజ్యపరమైన భూమిగా మార్చే టైమ్‌లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది.

దాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా.. గ్రామ పంచాయతీలకు అందించేలా చూడాలని పవన్ సూచించారు. దీంతో పంచాయతీలను మరింత బలోపేతం చేయొచ్చన్నారు. పవన్ సూచన.. చంద్రబాబుకు అద్భుతంగా నచ్చేసింది. మంచి సూచన చేశారంటూ.. పవన్‌కు కితాబిచ్చారు.

కోఆర్డినేషన్ అదుర్స్..

భూముల మార్పిడి అంశంపై వచ్చిన ఆదాయాన్ని.. గ్రామ పంచాయతీలకు మళ్లించడానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పవన్ సూచించడం.. చంద్రబాబు ఆదేశించడం.. కోఆర్డినేషన్ అదుర్స్ అంటూ.. రెండు పార్టీ నేతల్లో ఆనందం కనిపిస్తోంది.

చంద్రబాబు విజన్ అద్భుతం.. పని తీరు ఆదర్శం
పవన్ మీద చంద్రబాబు ప్రశంసలు గుప్పించడం కాదు.. గతంలో చంద్రబాబు మీద పవన్ కూడా ఇలాంటి ప్రశంసలే గుప్పించారు. చంద్రబాబు విజన్ అద్భుతమని.. ఆయన పని తీరు ఆదర్శం అంటూ గతంలో చాలా వేదికల మీద కొనియాడారు పవన్. ఇలా ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకుంటూ.. సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు మరింత అద్భుతమైన పాలన అందిస్తున్నారని రెండు పార్టీ నేతలు చెప్తున్నారు.

ప్రశంసలే కాదు.. ఇది తప్పు అని పవన్ చూపిస్తే.. సొంత పార్టీ నేతలైనా సరే చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ఏ మాత్రం వెనకాడడం లేదు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘటనలో ఇదే ప్రూవ్ అయింది కూడా అంటూ.. రెండు పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులపై ఎమ్మెల్యే దాడి ఘటనపై.. అటవీ శాఖ మంత్రి అయిన పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఆదేశాలతో.. ఎమ్మెల్యేతో పాటు జనసేన నేతలపై కేసులు పెట్టారు. పవన్ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు.. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు.

కూటమి పార్టీల్లో మంచి కలివిడితనం..
కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత.. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తుతున్నాయనే ప్రచారం జరిగింది. రాజకీయాల్లో ఇలాంటి కామన్ కూడా ! ఐతే అలాంటి విభేదాలకు చెక్ పెట్టడమే కాదు.. కలిసి పనిచేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే పవర్ ను.. తమ తీరుతో పార్టీ కేడర్‌కు చంద్రబాబు, పవన్ పరోక్షంగా అందిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇవ్వడం.. ఒకరి సూచనలపై మరొకరు ప్రశంసలు గుప్పించడంతో.. పార్టీ కేడర్‌కు మంచి మెసేజ్ వెళ్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్‌గా కూటమి పార్టీల్లో మంచి కలివిడితనం కనిపిస్తోంది. బంధం మరింత స్ట్రాంగ్ అవుతున్నట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.

Also Read: ఏపీలో జిల్లాల పునర్విభజన.. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలేవి? కూటమి ప్రభుత్వం లక్ష్యమేంటి?