AP New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజన.. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలేవి? కూటమి ప్రభుత్వం లక్ష్యమేంటి?

జిల్లాల పునర్విభజనతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను కూడా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. (AP New Districts)

AP New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజన.. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలేవి? కూటమి ప్రభుత్వం లక్ష్యమేంటి?

CM Chandrababu Naidu

Updated On : August 22, 2025 / 9:50 PM IST

AP New Districts: ఏపీలో మళ్లీ జిల్లాల విభజన జరగబోతోంది. విభజనలో వైసీపీ సర్కార్ చేసిన తప్పులను సవరిస్తామని.. జనాల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయ్. ఇప్పుడు దాన్ని నిజం చేసేందుకు రెడీ అయ్యాయ్‌. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. మరి కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు ఏంటి.. పేర్లు కూడా మారబోతున్నాయా.. జిల్లాల పునర్విజన వెనక కూటమి ప్రభుత్వం లక్ష్యమేంటి…

జిల్లాల పేర్ల మార్పుపై సర్కార్‌ తీవ్ర కసరత్తు..

13 జిల్లాలతో ఉమ్మడి ఏపీ నుంచి.. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఐతే వైసీపీ హయాంలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతూ.. వైసీపీ హయాంలో 13 జిల్లాలు కాస్త 26గా మారిపోయాయ్‌. ఆ సమయంలో చాలా చోట్ల జనాల సెంటిమెంట్లకు న్యాయం జరగలేదనే విమర్శలు వినిపించాయ్‌. జిల్లా కేంద్రాల ఎంపిక కూడా వివాదంగా మారింది.

ఐతే తాము అధికారంలోకి వస్తే.. ఈ లోపాలను సవరిస్తూ అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయ్‌. ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్ల మార్పుపై చంద్రబాబు సర్కార్‌ తీవ్ర కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో జిల్లా విభజన సరిగా జరగలేదని.. జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం.. జిల్లాల సరిహద్దులు, పేర్లు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది.

ప్రత్యేక జిల్లాగా అమరావతి..!

21న జరిగిన కేబినెట్ సమావేశంలోనూ జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ నెల 29, 30 తేదీల్లో మంత్రివర్గ ఉపసంఘం.. జిల్లా పర్యటనలు చేపట్టనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా.. వీటి సంఖ్యను 32కి పెంచే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయ్‌. అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుందని టాక్‌. (AP New Districts)

పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలతో… అమరావతి జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని.. మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వినతి సమర్పించారు.
మదనపల్లి, గూడూరు, ఆదోని, పలాస, పోలవరం ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయటన. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా… జిల్లా కేంద్రాలకు ప్రయాణ దూరాన్ని తగ్గించి, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జిల్లాల పునర్విభజనలో పేర్ల మార్పు కీలకం..

అటు జిల్లాల పునర్విభజనలో పేర్ల మార్పు కూడా కీలక అంశంగా ఉందట. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో.. ఏదో ఒక జిల్లాకు ప్రముఖ కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినతి సమర్పించారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందనే గుసగుస వినిపిస్తోంది. బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లాల పునర్విభజనతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను కూడా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని… కృష్ణా జిల్లాలోని కొత్తపల్లి, బిళ్లపల్లి, మడిచర్ల గ్రామాలను బాపులపాడు మండలం నుంచి తొలగించి నూజివీడు లేదా ముసునూరు మండలాల్లో కలపాలని వినతులు వచ్చాయ్‌.(AP New Districts)

శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండల కేంద్రంగా మురపాకను మార్చాలని.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నాయ్‌.

అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం..

జిల్లాల పునర్విభజనపై సమగ్ర అధ్యయనం కోసం.. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి, నారాయణ, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు.. ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు.

ఈ నెల 29, 30 తేదీల్లో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాల్లో పర్యటించనుంది. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో చర్చించి జనాల నుంచి వినతులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2 వరకు కలెక్టర్ కార్యాలయాల్లోనూ అప్లికేషన్స్‌ తీసుకుంటారు. వీటి ఆధారంగా సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. డేట్ ఫిక్స్.. మొదట ఈ 9 జిల్లాల్లోనే..