Delimitation: రిజర్వ్‌డ్‌ స్థానాల్లో సిట్టింగ్‌లు, నేతల్లో టెన్షన్ ఎందుకు? ఏపీలో డీలిటిటేషన్‌తో జరగబోయేది ఏంటి..?

నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. కొత్తగా 88 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో.. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్‌.

  • Published On : March 28, 2026 / 11:59 PM IST
  • ఏపీలో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..
  • డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలని ప్రభుత్వం టార్గెట్‌..
  • డీలిమిటేషన్‌తో రిజర్వ్‌డ్‌ స్థానాల్లో భారీ మార్పులు..
  • రిజర్వ్‌డ్‌ స్థానాల్లో సిట్టింగ్‌లు, నేతల్లో ఉత్కంఠ..
  • వాళ్లకు ఎందుకు టెన్షన్.. ఏం జరగబోతోంది ?
  • డీమిలిటేషన్‌తో పెరగబోయే రిజర్వ్‌డ్‌ స్థానాలు ఎన్ని?

 

Delimitation: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు భారీగా పెరగబోతున్నాయ్‌. వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి రంగం సిద్ధం అవుతున్న వేళ.. రిజర్వ్‌డ్‌ స్థానాల సంగతేంటనేది హాట్‌ టాపిక్‌గా మారింది. డీలిమిటేషన్‌తో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే చాన్స్ ఉంది. దీంతో ఆ స్థానాలను స్థానాలను ఆశిస్తున్న వారు, ప్రస్తుతం సిట్టింగ్‌ల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఎందుకీ టెన్షన్‌.. డీలిటిటేషన్‌తో రిజర్వ్‌డ్ స్థానాల విషయంలో జరగబోయేది ఏంటి..

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలని పునర్విభజించాలని.. వాటి సంఖ్య 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఏపీలో భౌగోళికంగా, రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయ్‌. 50 శాతం సీట్లు పెంచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 263కి పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా.. ఏకంగా 88 అసెంబ్లీ స్థానాలు పెరగడంతో.. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం పెరుగుతుంది. కొత్త నాయకత్వం అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ పరిణామం ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే.. దానికి తగినట్లుగా శాసన మండలిలోనూ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నాయ్‌.

రాష్ట్రంలో మారిపోనున్న రాజకీయ ముఖచిత్రం..

నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. కొత్తగా 88 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో.. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్‌. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో జరగబోయే మార్పులపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయా వర్గాలకు కొత్తగా రిజర్వ్‌ అయ్యే నియోజకవర్గాలపై.. ఇప్పటి నుంచే లెక్కలు కనిపిస్తున్నాయ్‌. యాడ్ అయ్యేది ఏంటి.. కోల్పోయేది ఏంటంటూ అంచనాలు వేసుకుంటున్నారు మరికొందరు నేతలు. ప్రస్తుతం చట్టసభల్లో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో.. మొత్తం 36 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలుగా ప్రకటించారు. ఇందులో 29 ఎస్సీలకు.. 7ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. ఐతే ఇప్పుడు డీలిమిటేషన్‌తో నియోజకవర్గాలు పెరిగితే.. రిజర్వ్‌డ్‌ స్థానాలు కూడా పెరుగుతాయ్‌.

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు కూడా రెట్టింపు అయ్యే చాన్స్‌..

ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 263కు చేరితే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్ట ప్రకారం.. డీలిమిటేషన్‌ తర్వాత.. ఎస్సీలకు దాదాపు 45 స్థానాలు.. ఎస్టీలకు 12 స్థానాలు రిజర్వ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వు చేసిన స్థానాలు.. దాదాపు ప్రతి జిల్లాలో ఉండగా.. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండేసి స్థానాలు కేటాయించారు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు ఎక్కువగా ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు. పోలవరం జిల్లా పరిధిలోని రంపచోడవరం తప్ప.. మిగిలిన ఆరు ఎస్టీ నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా పరిధిలోనే ఉన్నాయ్‌. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఎస్టీలకు కేటాయించారు. ఐతే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రతిపాదనలతో.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్‌.

తమ అనువైన నియోజకవర్గాల ఏర్పాటు కోసం లెక్కలు..

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలను ఆశిస్తున్న వాళ్లు.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు.. డీలిమిటేషన్ పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ అనుభవిస్తున్న పరిస్థితి. కొత్తగా 88 స్థానాలు రాబోతుండడంతో.. నియోజకవర్గాల ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నేతలు తమ అనువైన నియోజకవర్గాల ఏర్పాటు కోసం లెక్కలు వేసుకుంటున్నారు. తమకు పట్టున్న ప్రాంతాలను రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కొందరు సీనియర్ నేతలు.. ఇప్పుడు తమ నియోజవర్గాన్ని రిజర్వేషన్ కేటగిరీ నుంచి తప్పించి జనరల్ చేసుకోవాలని.. ముందు నుంచే పావులు కదుపుతున్నారట. ఏమైనా.. నియోజకవర్గాల పునర్విభజన మొదలైతే.. రాబోయే రోజుల్లో రాజకీయం సరికొత్త మలుపులు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్‌స్టాప్ పడినట్లేనా?