Amaravati: ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
Amaravati: ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి.. పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా ఏపీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీకి అమరావతే రాజధాని అని.. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో.. తీర్మానం ప్రవేశ పెట్టింది. ఇప్పుడేం జరగబోతోంది.. అసలీ తీర్మానం ఎందుకు.. అమరావతి చుట్టూ వివాదాలు ఇక ముగిసినట్లేనా.. ఏళ్లుగా జరుగుతున్న చర్చకు ఎండ్ కార్డ్ పడబోతోందా.
రాజధాని అమరావతి చుట్టూ.. ఆంధ్రప్రదేశ్‌లో నడిచిన వివాదాలు.. రాజకీయాలు అంతా ఇంతా కాదు. కొన్నేళ్లుగా అమరావతి చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అమరావతిని రాజధానిగా గుర్తించగా.. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం సీన్ మారిపోయింది. మూడు రాజధానుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. కట్ చేస్తే అమరావతి వ్యవహారం చుట్టూ రాజకీయ రచ్చ నడిచింది. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ అధికారంలో ఉంది. దీంతో అమరావతి మీద ఇప్పుడూ.. ఎప్పుడూ.. ఎలాంటి వివాదాలు కనిపించొద్దు అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అంటూ.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా సమావేశం అయిన అసెంబ్లీ.. దీనికి సంబంధించి తీర్మానం చేసింది.
భవిష్యత్‌లో ప్రభుత్వాలు మారినా రాజధానిని మార్చకుండా రక్షణ..
శనివారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు.. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 5(2)లో ఎట్ అమరావతి అనే పదాన్ని జోడించడం ద్వారా సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. అమరావతి అంటే ఏపీ సీఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన రాజధాని ప్రాంతం అని స్పష్టంగా నిర్వచించాలని ప్రతిపాదించింది. ఈ చర్య ద్వారా రాజధాని అనిశ్చితిని పూర్తిగా తొలగించి.. భవిష్యత్‌లో ప్రభుత్వాలు మారినా అమరావతి స్థితి మారకుండా చట్టపరమైన రక్షణ కల్పించడం లక్ష్యం. తీర్మానాన్ని కేంద్ర హోం మినిస్ట్రీకి పంపించి.. పార్లమెంటు బడ్జెట్ సెషన్లోనే సవరణ బిల్లుగా చర్చించి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది హైకోర్టు ఫుల్ బెంచ్ ఆదేశాలు, ప్రధాని కార్యాలయం సూచనల మేరకు చేపట్టిన చర్య అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయ్.
అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుందనే అభిప్రాయాలు..
వైసీపీ హయాంలో.. రాజధాని అమరావతి విషయంలో కనిపించిన రాజకీయ పరిణామాలతో.. అప్రమత్తం అయిన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టేసింది. దీంతో అమరావతి ప్రాంత జనాలు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు.. నిరసనలకు దిగారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాజధాని అమరావతి నిర్మాణ పనులు స్పీడప్ అయ్యాయ్. ఐతే భవిష్యత్‌లో మరెవరూ అధికారంలోకి వచ్చినా.. రాజధానిని కదిలించకుండా ఉండాలంటే దీనికి చట్టబద్ధమైన రక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టంగా చేర్చడం ద్వారా.. దీనికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. పార్లమెంట్లో చట్టసవరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
రాజధాని వివాదాలకు ఎండ్ కార్డ్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఇప్పుడు ఏపీ సర్కార్ తీర్మానంతో.. అమరావతి వ్యవహారంలో జరుగుతున్న రచ్చకు ఫుల్స్టాప్ పడుతుందా.. ఇక రాజధాని వివాదాలకు ఎండ్ కార్డ్ పడినట్లేనా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అమరావతి రాజధానిని అడ్డుకోవాలని తామెప్పుడూ ప్రయత్నించలేదని అంటున్న వైసీపీ.. తీర్మానం వ్యవహారాన్ని పొలిటికల్ డ్రామా అంటూ కొట్టిపారేస్తోంది. ఇక అటు అమరావతి చట్టబద్ధతను పటిష్టం చేసే దిశగా తీర్మానం చేయడంపై.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్వాగతించారు. సీఎం చంద్రబాబు ముందుచూపుపై ప్రశంసలు గుప్పిస్తూనే.. మళ్లీ జగన్‌లాంటి వాళ్లు వస్తే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది.
Also Read: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయం వారందరిలో కనిపించింది- పేర్నినాని
