Kottu Satyanarayana Representative Image (Image Credit To Original Source)
Kottu Satyanarayana: ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. గత సర్కార్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పార్టీ ఓడాక సడెన్‌గా ఆయనను నియోజకవర్గ ఇంచార్జ్‌గా తప్పించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయన గారు నియోజకవర్గ ఇంచార్జ్‌కు సహయ నిరాకరణే ఎజెండాగా పెట్టుకున్నారట. క్యాడర్ కొత్త ఇంచార్జ్ వైపు మొగ్గు చూపుతుంటే.. ఆ మాజీమంత్రి మాత్రం డైలమాలో ఉండిపోయారట. ఇంతకు ఎవరా నేత? ఆయనను ఇంచార్జ్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించినట్లు? ఆ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్‌కు దారేది?
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సీనియర్ నేత అలకపాన్పు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో..మాజీ డిప్యూటీ సీఎం, కొట్టు సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ ప్రజాపక్షంగా గానీ, పార్టీ పరంగా గానీ ఆయన గొంతు వినిపించకపోవడంతో, కొట్టు అలకపాన్పు ఎక్కినట్లు చర్చే జరగుతోంది.
వడ్డీ రఘురామ్ నాయుడుకు వైసీపీ అధిష్టానం తాడేపల్లిగూడెం అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా నియమించడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే కొట్టు మద్దతు ఇస్తారా, లేదా అన్న డైలమా కొనసాగింది. కానీ క్యాడర్ ఆయన మద్దతు ఉన్నా, లేకున్నా, ముందుకు వెళ్లడం తప్పదంటూ కొత్త రథసారథికి స్వాగతం పలకడం, నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని సక్సెస్ చేయడంతో..కొట్టు డైలమాలో పడిపోయారట.
ఈ సమావేశానికి ఇదే తాడేపల్లిగూడెంలో ఉండి కూడా కొట్టు సత్యనారాయణ హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షుడితో కలిపి వడ్డీ రఘురామ్ స్వయంగా కొట్టు సత్యనారాయణ నివాసానికి వెళ్లి మరీ, పార్టీ సమావేశానికి రావాలని ఆహ్వానించినా, ఆయన గైర్హాజరు కావడంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండల అధ్యక్షులు కూడా సమావేశానికి రాకపోవడంతో, వారిపై వేటు తప్పదేమోనన్న చర్చ మొదలైంది.
తాడేపల్లిగూడెంలో క్యాడర్‌ను బలోపేతం చేసే పనిలో పడ్డారట వడ్డీ రఘురామ్. పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు నుంచి తొలగించిన తర్వాత ఎక్కడా కనపడని కొట్టు సత్యనారాయణ..భీమవరం పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌కు స్వాగతం పలికారు. ఆ సమయంలో కొట్టు సత్యనారాయణతో జగన్ కాస్త సీరియస్‌గానే వ్యవహరించినట్లు టాక్. అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత టీడీపీలో, ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన కొట్టు సత్యనారాయణ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండటంతో ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. ఇక టీడీపీలోకి వెళ్ళాలనుకున్నా..కొట్టు సత్యనారాయణను అంత తేలికగా పార్టీలోకి చేర్చుకోరని, పసుపు కండువా కప్పే అవకాశమే ఉండదని ప్రచారం జరుగుతోంది. దీంతో కొట్టు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.
తాడేపల్లిగూడెం వైసీపీలో రెండు వర్గాలు ఉండగా..కొట్టు సత్యనారాయణకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టడంతో..ఇక నియోజకవర్గంలో పార్టీ దూకుడుకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని క్యాడర్ హ్యాపీగా ఫీల్ అవుతోందట. గత ఎన్నికలకు ముందే కొట్టును తప్పించి ఉంటే..తాడేపల్లిగూడెంలో గెలిచే వాళ్లమంటూ పార్టీ పెద్దలకు చెప్పారట పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రతాపం చూపించండంటూ, నాయకులకు హితవు పలుకుతున్నారట వైసీపీ ముఖ్యనేతలు.
కొత్త రథసారథి వడ్డీ రఘురామ్ అయినా అందర్నీ కలుపుకుని ముందుకెళ్తారో లేదో అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అలక మీదున్న కొట్టు సత్యనారాయణ యాక్టీవ్ అవుతారా? లేక తనదారి తన చూసుకుంటారా అనేది క్యాడర్‌ను వెంటాడుతున్న ప్రశ్న. కొట్టుకు మద్దతుగా వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన మండల అధ్యక్షులపైనా వేటు వేస్తారా? వాళ్లిద్దరు కూడా వడ్డీ రఘురామ్‌తో కలిసి వస్తారా అనేది చూడాలి. ఇప్పటికైతే కొట్టు పొలిటికల్ ఫ్యూచర్‌లో డైలమాలో పడిందన్న చర్చ అయితే జరుగుతోంది.
Also Read: కొణతాల రామకృష్ణ మంత్రి పదవి ఆశలు నెరవేరేనా? అందుకోసమే టోన్ మార్చేశారా?