Pawan Kalyan: జోరు పెంచండి, ఇచ్చి పడేయండి..! జనసేన అధికార ప్రతినిధులకు పవన్ బూస్టప్.. ఎందుకిలా?
ఇటీవలే పార్టీ కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఒక్కడినే మాట్లాడాలా? మీరంతా ఉండి ఎందుకు అని ప్రశ్నించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే యాక్టివ్ అయ్యారు.
- Naveen
- Updated on- April 17, 2026 / 01:06 AM IST
- జోరు పెంచండి..ఇచ్చి పడేయండని సూచన
- పదునైన మాటలు, పవర్ ఫుల్ పంచ్‌లతో కౌంటర్ వేయాలని సూచన
- విమర్శలకు కౌంటర్ విషయంలో తగ్గొద్దని శిక్షణ
Pawan Kalyan: విపక్షం దాడిని తిప్పికొట్టకపోతే ఎలా? స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు వెనకాడొద్దు. డయాస్ ఏదైనా సమయం సందర్భాన్ని బట్టి గట్టిగా మాట్లాడాలి. పార్టీ వాయిస్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బూతులు వద్దు పదునైన మాటలే ముద్దు. పార్టీపై వస్తున్న విమర్శలను ఆధారాలతో సహా తిప్పి కొట్టండి. పార్టీకైనా, అధినేత తరఫున గళం వినిపించాల్సింది మీరే అంటూ..జనసేన అధికార ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారట పవన్ కల్యాణ్. గతంలో ఎప్పుడూ లేనట్లుగా స్పోక్స్ పర్సన్స్‌కు ఈ శిక్షణ ఎందుకు?
జనసేన పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేయాలనే యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటికే చాలా వరకు పార్టీ కమిటీల ఏర్పాటును పూర్తి చేసిన జనసేన చీఫ్, సభ్యత్వ నమోదును స్పీడప్ చేశారు. 20 లక్షల సభ్యత్వాలు టార్గెట్‌గా సుదీర్ఘంగా డ్రైవ్ చేస్తున్నారు. ఇదే కాకుండా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించేందుకు లీడర్లను సిద్ధం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన అధికార ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. ఇటీవల జనసేన పార్టీపైనా, పవన్ కల్యాణ్ పైనా వస్తున్న కొన్ని విమర్శలను తిప్పికొట్టడంలో స్పోక్స్ పర్సన్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ కావట్లేదన్న భావనతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందరు నేతలు పార్టీ వేదికలపై, టీవీ డిబేట్లు, ప్రెస్‌మీట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..తలనొప్పులు తెచ్చి పెడుతుండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార ప్రతినిధులు పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించాలని..అలా అని లైన్ దాటి మాట్లాడొద్దని డైరెక్షన్స్ ఇచ్చారు పవన్.
నేతల తీరుపై పవన్ సీరియస్..
పార్టీ అధికార ప్రతినిధులకు రెండు రోజుల పాటు ట్రైనింగ్ వర్క్‌షాప్ నిర్వహించింది జనసేన. పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికార ప్రతినిధులకు వివిధ అంశాలపై ఈ శిక్షణ తరగతులు పెట్టారు. ముఖ్యంగా మీడియా చర్చల్లో బాధ్యతాయుతంగా, సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను ఈ రెండు రోజుల వారికి శిక్షణ ఇచ్చారు. ఇకపై రెగ్యులర్‌గా వీరంతా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించనున్నారు. ఇటీవలే పార్టీ కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఒక్కడినే మాట్లాడాలా? మీరంతా ఉండి ఎందుకు అని ప్రశ్నించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే యాక్టివ్ అయ్యారు. అవసరం అయ్యినప్పుడల్లా మాట్లాడుతున్నారు. అయితే చర్చా వేదికల్లోనూ పార్టీ వాయిస్‌ను వినిపించేలా అధికార ప్రతినిధులకు హితబోధ చేశారు.
బూతులు వద్దు, మహిళల జోలికి అసలే వెళ్లొద్దు..
మాట పదునుగా ఉండాలి. బూతులు మాట్లాడొద్దు. మహిళల జోలికి అసలే వెళ్లొద్దు. వ్యక్తిగత అంశాల ముచ్చటే వద్దు. సబ్జెక్ట్ బేస్డ్‌గా కౌంటర్ ఉండాలి. పిన్ టు పిన్ ఇచ్చిపడేయాలంతే అంటూ స్పోక్స్ పర్సన్స్‌కు జనసేన శిక్షణ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చారు. అనవసర విషయాలను ప్రస్తావించి ఇరకాటంలో పడొద్దని..లైన్ దాటి మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అలాగని విపక్షం ఏ విమర్శ చేసినా తమకేం పట్టనట్లు ఉంటే కుదరదని తేల్చి చెప్పారు.
అధికార ప్రతినిధులు అంటే పార్టీ తరఫున, అధినేత తరఫున గళం వినిపించే బాధ్యత మీపై ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఇలా జనసేన అధికార ప్రతినిధులకు వివిధ అంశాలపై డైరెక్షన్స్ ఇచ్చారు. మీడియా చర్చల్లో బాధ్యతాయుతంగా, సమర్థంగా పాల్గొనేలా స్కిల్స్ పెంచుకోవాలని..పార్టీ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పుకొచ్చారు. ఇలా అధికార ప్రతినిధులకు శిక్షణ ఇచ్చి మరీ జోష్ పెంచడం వెనుక సేనాని వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: వామ్మో.. ఏపీలోని పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఏకంగా 2 కోట్ల నగదు సీజ్
