Kotamreddy Sridhar Reddy: దూకుడు తగ్గించిన ఫైర్ బ్రాండ్ లీడర్ కోటంరెడ్డి? సడెన్‌గా ఎందుకు సైలెంట్ అయ్యారు?

వందల కోట్ల నిధులతో నెల్లూరు రూరల్‌లో ఓ రేంజ్‌లో డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టి సీఎం చంద్రబాబుతో ప్రశంసలు పొందారు. పనితీరులో రాష్ట్రవ్యాప్తంగా 32వ స్థానం, నెల్లూరులో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి..విస్తరణలో మంత్రి పదవి పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది.

  • Published On : March 22, 2026 / 06:00 AM IST

Representative Image (Image Credit To Original Source)

  • అమాత్య రేసులో ఉండి సైలెంట్ అవడం వెనుక ప్లానేంటి?
  • తమ్ముడిని ఎమ్మెల్యే చేయాలని తపన పడుతున్నారా?
  • నియోజకవర్గ అభివృద్ధిపైనే కాన్సన్‌ట్రేట్‌ చేశారా?

 

Kotamreddy Sridhar Reddy: హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రతిపక్షాలపై ఒంటి కాలిపై లేస్తూ..పొలిటికల్ హాట్ టాపిక్‌గా ఉండేవారు. పైగా మంత్రి పదవి రేసులో ఉన్నారు. అమాత్య యోగం కోసం ఆశపడుతున్నారు. అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఫైర్‌ను తీసి పక్కనపెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి మంత్రంతో దూసుకెళ్తున్నారట. తన నెక్స్ట్ టార్గెట్‌పైనే ఫోకస్ పెట్టారట. ఆ ఎమ్మెల్యే పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు దక్కడమే కాదు..జిల్లాలోనే నంబర్ వన్ ప్లేస్ దక్కిందట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయన నెక్స్ట్ పొలిటికల్ టార్గెట్ ఏంటి?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు. 2014, 2019లో రెండుసార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి..గత ఎన్నికలకు ముందు ఫ్యాన్ స్విచ్చాఫ్‌ చేసి సైకిల్ ఎక్కారు. నెల్లూరు రూరల్‌లో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అలాంటి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫైర్ బ్రాండ్ లీడర్‌గా..ఓవైపు వైసీపీని టార్గెట్‌ చేస్తూనే..మరోవైపు నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెడుతూ వచ్చారు. వందల కోట్ల నిధులతో నెల్లూరు రూరల్‌లో ఓ రేంజ్‌లో డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టి సీఎం చంద్రబాబుతో ప్రశంసలు పొందారు. పనితీరులో రాష్ట్రవ్యాప్తంగా 32వ స్థానం, నెల్లూరులో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి..విస్తరణలో మంత్రి పదవి పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే ఆయన కూడా దూకుడు పెంచుతూ వచ్చారు. కానీ కొన్ని రోజులుగా ఆయన తన రూట్‌ను మార్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అని చెప్పుకునేలా..

అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డికి నెంబర్ వన్ ప్లేస్ దక్కడం..సీఎం చంద్రబాబు దగ్గర ప్రశంసలు పొందడం వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నది పబ్లిక్ టాక్. ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఆ లోటు కనిపించకుండా గిరిధర్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అని ప్రజలు చెప్పుకునేలా వందల కోట్లతో అభివృద్ధి పనులను దగ్గరుండి జరిపిస్తున్నారట. ఇలా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడం వల్లే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంచి పేరు, ప్రశంసలు దక్కుతున్నాయని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారట.

అయితే ఒక పక్క మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెక్స్ట్ టార్గెట్ తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేను చేసుకోవడమేనట. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తాను పోటీ చేయనని తన తమ్ముడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పలు సందర్భాల్లో చెప్పారు కోటంరెడ్డి. సోదరుడిని ఎమ్మెల్యే చేసేందుకు అమాత్య ఆశలను కూడా అలా పక్కన పెట్టి..నియోజకవర్గంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారట కోటంరెడ్డి.

ప్రతి పైసా ఖర్చు వివరాలను ప్రజలకు తెలిపేలా బుక్ లెట్‌..

రెండేళ్లు పూర్తికాక ముందే నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో రూ.613 కోట్లతో చంద్రన్న రహదారులు, చంద్రన్న పార్కులు, చంద్రన్న వెలుగులు, బ్రిడ్జిల అభివృద్ధి పనుల జాతర చేపట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా..ప్రతి పైసా ఖర్చు వివరాలను ప్రజలకు తెలిపేలా ఒక బుక్ లెట్‌ తయారు చేసి పబ్లిక్ డొమెయిన్‌లో ఉంచారట. అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్లెట్‌ను సీఎం చంద్రబాబుకు కూడా చూపించారట ఎమ్మెల్యే కోటంరెడ్డి. వీటిలో కొన్ని పూర్తి కాగా..ఇంకొన్ని చివరి దశలో..మరి కొన్ని టెండర్ల దశలో ఉన్నాయని అంటున్నారు. ఇటీవల 339 పనులను ఒకేసారి స్థానిక ప్రజలతో శంకుస్థాపన చేసి 60 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు కోటంరెడ్డి. మరోసారి రూ.27 కోట్లతో ఈ నెల 22న స్థానిక ప్రజల చేత 240 చోట్ల ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారట.

పక్కా వ్యూహం ప్రకారమే నియోజకవర్గ డెవలప్‌మెంట్‌కు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారట కోటంరెడ్డి. తనకు మంత్రి పదవి వస్తే సంతోషం. కానీ వచ్చే ఎన్నికల్లో తమ్ముడిని ఎమ్మెల్యే చేసి తీరాలని పట్టుదలతో ఉన్నారట. కోటంరెడ్డికి అమాత్య యోగం ఎప్పుడు దక్కుతుందో? సోదరుడిని ఎమ్మెల్యే చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Also Read: సీనియర్ నేత యనమల చిరకాల కోరిక తీరబోతోందా? ఈసారి బెర్త్ పక్కానా?