Ganta Srinivasa Rao: ఆయన సీనియర్ ఎమ్మెల్యే. గతంలో ఓ సారి మంత్రి అయ్యారు. పార్టీ తరఫున అందరూ ఓడినా గెలిచిన తక్కువ మందిలో ఆయన ఒకరు. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన..అమాత్య ఆశలో తేలియాడుతున్నారు. కానీ అధిష్టానం ఆయన్ను తమ వాడు అనుకోవట్లేదట. అప్పట్లో ఆయన మౌనమే ఇప్పుడు అవకాశాలు దక్కకపోవడానికి కారణమట. వైసీపీపై ఆయన విసుర్లు అందుకేనా? టీడీపీ పెద్దల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారా? మంత్రి అయి రిలాక్స్ అవుదామనుకుంటున్న ఆయన ఆశలు నెరవేరేనా?
గంటా శ్రీనివాస్. కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఏపీ పాలిటిక్స్‌లో ఆయన రూటే సెపరేటు. గెలిచిన చోటు నుంచి తిరిగి పోటీ చేయకపోవడం ఆయన ప్రత్యేకత. అయితే అందుకు భిన్నంగా భీమిలి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గంటా. ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాకపోతే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా సొంత నియోజకవర్గానికే పరిమితయ్యే పరిస్థితి ఉందట. ఇప్పుడు మళ్లీ మంత్రి కావాల్సిన జాతకం అయితే..బొమ్మ తిరగబడినట్లు అయిందట పరిస్థితి. అయితే టీడీపీ అధిష్టానంతో గంటాకు టర్మ్స్ అంత బాలేవట. అందుకే మొన్నటి ఎన్నికల ముందు అయితే భీమిలీ టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలే చేశారట.
టీడీపీ అధిష్టానం ఆయనకు నో కాన్ఫిడెన్స్ బోర్డు పెట్టేసిందని, ఇప్పట్లో దాన్ని మార్చే పరిస్ధితులు కూడా కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, గంటా మధ్య దూరం బహిరంగ రహస్యం. ఇటీవల భీమిలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇద్దరు కార్పొరేటర్లు గళం విప్పితే మందలించాల్సిన జిల్లా నాయకత్వం దానికి విస్తృతమైన ప్రచారం కల్పించడంతో పాటు హైకమాండ్ వరకు మోసిందట.
ఇక విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు కుదించడంపై గంటా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారి తీసింది. హైకమాండ్ ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటివన్నీ పార్టీ పెద్దలతో ఆయనకు గ్యాప్ పెంచడానికి రీజన్స్‌గా మారాయట. అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని, బ్యాక్‌గ్రౌండ్ కూడా గట్టిగానే ఉందంటున్నారు.
2014-19 మధ్య చంద్రబాబు క్యాబినెట్‌లో HRD మంత్రిగా పనిచేశారు గంటా. అప్పట్లో పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో వర్గ పోరు నడిచింది. విశాఖ భూకుంభకోణం సహా అనేక అంశాలపై అయ్యన్న, గంటాల మధ్య వార్ పీక్స్‌లో నడిచింది. అధినాయకత్వంతో విభేదించడం, అలకపూనడం వంటి చర్యలు గంటా మీద చంద్రబాబుకు ఒక అభిప్రాయం ఏర్పడటానికి కారణం అయ్యాయంటున్నారు.
ఇక 2019లో టీడీపీ ఓడిపోయినా విశాఖ జిల్లాలో మాత్రం నాలుగు సీట్లు గెలుచుకుంది. వీటిలో గంటా విజయం సాధించిన విశాఖ నార్త్ ఒకటి. అప్పట్లో గంటా శ్రీనివాస్ తమను లైట్ తీసుకున్నారన్న అభిప్రాయం టీడీపీ పెద్దల్లో బలంగా ఉందట. అందుకు తగ్గట్టే అధినేత కార్యక్రమాలకు దూరంగా ఉండేవారాయన. హైకమాండ్ ఫోన్లకు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గ బాధ్యతలు ఇంచార్జ్ చేతుల్లో పెట్టేయడం వంటివి టీడీపీ పెద్దల దృష్టిలో ఆయన పలుచన కావడానికి కారణం అయ్యాయట.
అదే సమయంలో గంటా వైసీపీకి దగ్గరవుతున్నారని, ఫ్యాన్ పార్టీ గూటికి చేరేందుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ వార్తలను గంటా ఖండించకపోవడంలో కూడా టీడీపీ పెద్దలకు నచ్చలేదట. అంతేకాదు రుషికొండ వివాదం, చంద్రబాబు అరెస్ట్, లోకేశ్ పర్యటనల్లో జరిగిన వివాదంపై కూడా గంటా రియాక్ట్ కాలేదు. ఈ అంశాలే ఆయనకు టీడీపీ పెద్దలతో గ్యాప్‌కు దారి తీశాయట. దీంతో పొలిటికల్ ప్లాన్స్ వేయడంలో దిట్ట అయిన గంటా ఇప్పుడు స్టైల్ మార్చారట. తొందరగానే తత్వాన్ని గ్రహించి..ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. వైసీపీపై ఘాటు విమర్శలు చేస్తూ చంద్రబాబు దృష్టిలో పడేందుకు తాపత్రయ పడుతున్నారట గంటా.
గతంలో పార్టీ పెద్దలు జిల్లాకు వస్తే కూడా లైట్ తీసుకున్న గంటా ఇప్పుడు ఎదురెళ్ళి మరీ స్వాగతం పలికే వరకు వచ్చిందట వ్యవహారం. ఈ మధ్య లోకేశ్ తరచూ విశాఖలో పర్యటిస్తున్నారు. గతానికి భిన్నంగా గంటా శ్రీనివాస్ ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ స్వాగతం పలుకుతుండటాన్ని చూసి సొంత పార్టీ నేతలే అవాక్కవుతున్నారట. తాజాగా రెండు రోజుల పర్యటన కోసం విశాఖకు వచ్చిన లోకేశ్‌తో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు గంటా. భీమిలి నియోజకవర్గంలోని ఓ స్కూల్స్‌లో ఏఐ ల్యాబ్స్‌ను ప్రారంభించడం కొంత సానుకూలతగా భావిస్తున్నారు.
ఇక ఒకే పార్టీలో ఉన్నా ఇన్నాళ్లు ఉప్పునిప్పులా కనిపించిన అయ్యన్న, గంటాలు ఈ మధ్యే యాదృచ్చికంగా కలిశారు. ఓ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్పీకర్‌తో మర్యాదపూర్వక కరచాలనం చేశారు గంటా. ఇవన్నీ ఒక్కొక్కటిగా పేర్చుకుని చూసుకుంటే మాజీ మంత్రికి ఆలస్యంగా తత్వం బోధపడినట్టే కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
త్వరలో క్యాబినెట్ విస్తరణ జరిగితే చోటు దక్కించుకునే ప్లాన్‌తో పాటు..వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడు రవితేజ కోసం ఇప్పటి నుంచే ప్లాట్ ఫామ్ రెడీ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు గంటా. ఇప్పటికే భీమిలి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు సన్నాఫ్ గంటా. అలా మెల్లిగా రవితేజను లోకేశ్ టీమ్‌లో చేర్చగలిగితే..ఇక సమస్య ఉండబోదన్నది భీమిలి ఎమ్మెల్యే వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఆయనలో వచ్చిన ఈ మార్పుపై మాత్రం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.