Ys Jagan Representative Image (Image Credit To Original Source)
Ys Jagan: ఇప్పటిదాకా వేరు. ఇక నుంచి మరో తీరు. లోకల్ ఫైట్ కాదు..ఢిల్లీలోనే తేల్చుకుంటాం. ఊరుకునేది లేదు. తగ్గేది అసలే లేదంటున్నారు వైసీపీ అధినేత. తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూలో సిట్ రిపోర్ట్‌తో రాజుకున్న వివాదం కాస్త.. డైలాగ్‌వార్‌లు..దాడులకు దారితీసింది. ఈ అన్ని అంశాలపై ఇక హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామంటూ జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? స్టేట్ పొలిటికల్ ఫైట్‌పై ఢిల్లీలో తేల్చుకునేదేంటి?
తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ ఏపీలో పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. స్పెషల్ సిట్ ఛార్జిషీట్ తర్వాత పరిణామాలు మొత్తం మారిపోయాయి. అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్న విమర్శల దాడితో..రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌తో మొదలై దాడుల వరకు చేరింది. మాజీమంత్రి అంబటి రాంబాబు అయితే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు పవన్ తప్పుడు ప్రచారం చేశారని తక్షణమే సారీ చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. లడ్డూ విషయంలో వాస్తవాలు బయటకు రావడంతోనే ప్రశ్నించే నేతలపై ఎదురు దాడులకు దిగుతున్నారని డైవర్షన్ కోసమే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారంటోంది వైసీపీ.
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్..
ఓవైపు అంబటి రాంబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపటం.. జోగి రమేశ్ ఇంటిపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఎండగడుతామంటోంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు ఫ్యాన్ పార్టీ ఎంపీలు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ ఢిల్లీలో ఒకసారి ఉద్యమించింది. జగన్ సహా కీలక నేతలు అంతా హస్తినకు వెళ్లి మరీ ఆందోళనలు చేశారు. ఏపీలో తమ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని..దాడులు చేసి వేధిస్తోందని వైసీపీ ఆనాడు నిరసనలు తెలిపింది. ఈ కార్యక్రమానికి సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, అలాగే ఇతర పార్టీల ఎంపీలు వచ్చారు. కాంగ్రెస్ నుంచి కానీ ఎన్డీయే నుంచి కానీ ఎవరూ హాజరు కాలేదు. ఇప్పుడు మరోసారి దేశ రాజధానిలో తమ గళం వినిపించేందుకు రెడీ అవుతోంది వైసీపీ. ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు..కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో సిట్ ఇచ్చిన రిపోర్ట్‌ను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లబోతున్నారట. ఇప్పటికే వైసీపీ నేతల ఇళ్ల మీద దాడిని ఖండిస్తూ చేసిన ట్వీట్‌లో కేంద్ర హోంశాఖ, గవర్నర్‌ను ట్యాగ్ చేశారు జగన్.
కూటమి ప్రభుత్వ తీరును జాతీయ స్థాయిలో ఎక్స్‌పోజ్ చేసి తీరుతామంటోంది ఫ్యాన్ పార్టీ. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ. ఇక పార్లమెంట్ లో అంశాన్ని చర్చించేలా ప్లాన్ చేస్తున్న వైసీపీ త్వరలోనే ఢిల్లీకి వెళ్లి నిరసన తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతిని కలిసి కంప్లైంట్ చేయడంతో పాటు అవసరమైతే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరి..అన్ని అంశాలపై వివరించే ఆలోచనలో ఉన్నారట వైసీపీ పెద్దలు. కల్తీ నెయ్యి అంటూ తిరుమల శ్రీవారి ప్రతిష్టను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని..స్పెషల్ సిట్ రిపోర్ట్ చెప్పిన అంశాలను కూడా..కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో పెట్టాలన్నది ఫ్యాన్ పార్టీ నేతల ప్లాన్ అంటున్నారు. వైసీపీ నేతలపై దాడుల అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టి..వైసీపీ ఎంతవరకు మైలేజ్ సాధిస్తుందో చూడాలి.
Also Read: కల్తీ నెయ్యి వివాదం.. కూటమి బిగ్ స్కెచ్..! క్లైమాక్స్ ఎప్పుడు?