Ysrcp: గోదారి గట్టున వైసీపీ రియాక్టివేట్‌ అయ్యేదెప్పుడు..? పార్టీకి పట్టున్న చోట నేతల తీరు ఎందుకిలా?

ఇక మాజీ మంత్రి తానేటి వనిత తీరు మరీ విచిత్రం అంటున్నారు. ఆమె గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్. మేడమ్‌ గారు ఉండేది మాత్రం తాడేపల్లిగూడెంలో అంటున్నారు క్యాడర్.

  • Updated on- May 1, 2026 / 01:05 AM IST
  • గోదారి గట్టున వైసీపీ రియాక్టివేట్‌ అయ్యేదెప్పుడు..?
  • రిజర్వ్‌డ్‌ సీట్లలో ఫ్యాన్‌ రివర్స్‌లో తిరుగుతోందా.?
  • ఇంచార్జ్‌లు ఉన్నా..నియోజకవర్గాల్లో నో యాక్టివిటీ.!
  • నేతలు అజ్ఞాతం వీడకపోవడంతో క్యాడర్ గందరగోళం..

 

Ysrcp: గోదారి గట్టునున్న ఆ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లోనే గత వైభవం కనుమరుగు కాగా..రానురాను పాత సినిమాలో సీన్‌లా..క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతుందట అక్కడ వైసీపీ పరిస్థితి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీట్లలో అయితే పేరుకే ఇంచార్జులు అన్నట్లుగా ఉందట సిచ్యువేషన్‌. నడిపించే నాయకులు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసినట్లుగా నడుచుకుంటున్నారట. చేసేదేం లేక కార్యకర్తలు పక్క పార్టీల వైపు చూస్తున్నారట. పార్టీకి పట్టున్న చోట నేతల తీరు ఎందుకిలా?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా..మూడు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో మాత్రం రివర్స్‌ మోడ్‌లో ఉందట. కార్యకర్తకు అండగా ఉండాల్సిన ఇంచార్జ్‌లు..నియోజకవర్గంవైపు చూడకపోవడంతో క్యాడర్‌ రగిలిపోతోందట. గెలిచినప్పుడు నీడలా ఉన్న నేతలు, ఓడిపోయాక కనీసం కనిపించకపోవడంపై కార్యకర్తలే గుర్రుగా ఉన్నారట. చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న కంభం విజయరాజు ఎక్కడంటే..ఏలూరులో..నివాసం ఉంటున్నారట. అప్పుడప్పుడు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. చింతలపూడిలో కార్యకర్తపై ఏదైనా కేసు అయినా, సమస్య వచ్చినా.. ఆయన కోసం ఏలూరు దాకా పరుగెత్తాల్సి వస్తోందట. కార్యకర్తలు అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్నా అధిష్టానం పెద్దలు కూడా చక్కదిద్దలేదంటున్నారు.

తాడేపల్లిగూడెం వెళ్లినా మేడమ్ అందుబాటులో ఉంటారో లేదోనన్న డౌట్..

ఇక మాజీ మంత్రి తానేటి వనిత తీరు మరీ విచిత్రం అంటున్నారు. ఆమె గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్. మేడమ్‌ గారు ఉండేది మాత్రం తాడేపల్లిగూడెంలో అంటున్నారు క్యాడర్. అధికారంలో ఉన్నప్పుడు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన వనిత..ఆ తర్వాత గోపాలపురం నియోజకవర్గంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల టైమ్‌లో గోపాలపురం నియోజకవర్గంలో కలియ తిరిగిన వనితమ్మ, ఇప్పుడు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. ఏదైనా సమస్య వస్తే మేడమ్‌ కోసం తాడేపల్లిగూడెం వెళ్లినా..అక్కడ అందుబాటులో ఉంటారో లేదోనన్న గ్యారంటీ లేదని నియోజవర్గ కార్యకర్తలే బహిరంగ విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీంతో గోపాలపురంలో ఇప్పటికే కొందరు వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు..కూటమి పార్టీల్లోకి వెళ్లిపోగా మరి కొంతమంది అదే దారిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టికి కొంతమంది నియోజకవర్గ నేతలు తీసుకెళ్లిన ఆశించిన రెస్పాన్స్ రాలేదంటున్నారు.

ఓడిపోయాక కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..

మరోవైపు కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్ తలారి వెంకట్రావు తీరు కథ కూడా అంతే అంటున్నారు. ఈయన కొవ్వూరు నాయకుడు. కానీ, నివాసం మాత్రం గోపాలపురం నియోజకవర్గంలో ఉంటున్నారట. పని పడితే కార్యకర్తలు కొవ్వూరు వెళ్లాల్సి వస్తోందట. కిలోమీటర్ల ప్రయాణం..చేసి వెళ్లిన చివరకు నిరాశే మిగులుతుందట. 2019లో గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకటరావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని పార్టీ అధిష్టానం ఆయన్ను కొవ్వూరుకు పంపి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వనితను గోపాలపురం నియోజవర్గానికి తీసుకొచ్చి పోటీ చేయించారు. ఇద్దరు నేతలు ఓడిపోగా..తర్వాత కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదనేది ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే జిల్లాలో తాడేపల్లిగూడెం వైసీపీ ఇంచార్జ్‌ని మారుస్తారట. అప్పుడే ఈ మూడు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండే నేతలకే ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు నేతలు.

Also Read: దక్షిణాదిపై జనసేన గురి.. పవన్ కల్యాణ్ పెద్ద ప్లానే..! జాతీయ రాజకీయాలవైపు అడుగులు అందుకేనా?