AP Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Ap Rains

rains for three days : ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల జడివాన పడుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముంది.

దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ రాగల రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కుండపోతకు రహదారులు జలదిగ్బంధమయ్యాయి. రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో.. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఏకంగా 96.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పాతపట్నంలోని లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లను వర్షపు నీరు ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. విజయనగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో.. రోడ్లు వాగులను తలపించాయి. కనపాక ప్రాంతంలో అత్యధికంగా 14.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

విజయనగరంలో 15సెం.మీ, పూసపాటిరేగలో 14.3 సెం.మీ, డెంకాడలో 14.2, కొప్పెర్లలో 13.5, గోవిందపురంలో 12.8, నెల్లిమర్లలో 12.2, రాంబిల్లిలో 10.9, పైడి భీమవరంలో 10.8, కె.కోటపాడులో 9.5, బొందపల్లిలో 8.7, భోగాపురంలో 8.4, మారికవలస, భీమిలిలో 8.3, ఎల్‌.ఎన్‌.పేటలో 8.1, కొయ్యూరులో 7.8, విశాఖ రూరల్, దేవరాపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.