Cyclone Alert : ఏపీకి తుపాను గండం.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ.. 

Cyclone Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉండటంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి.

Andhra pradesh weather update

Cyclone Alert : ఏపీని మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భీకర స్థాయిలో ఈదురుగాలులు కూడా వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : TTD February 2027 Tickets : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి శ్రీవారి సేవా టికెట్ల విడుదల తేదీలు వచ్చేశాయ్!

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా.. అదేరోజు సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ఇది ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా.. వాయుగుండం తుపానుగా మారితే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తుపాను ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరందాటే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా తుపాను ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీయవచ్చునని పేర్కొంటున్నారు.

తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, వాతావరణ శాఖ సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలని అధికారులు సూచించారు.

ఏపీని వరుస తుపాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. అర్నబ్, మురసు తుపాన్లు కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. ఇటీవల సంభవించిన మురసు తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

మురసు తుపాను బీభత్సంతో రాష్ట్రంలో రూ. 2,484.43 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 12 నాటికి 17 రంగాల్లో ఈ నష్టం నమోదైనట్లు తెలిపింది. ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రాథమిక అంచనా నివేదికలో రూ.1,919.59 కోట్ల నష్టం కలిగిందని పేర్కొనగా.. క్షేత్ర స్థాయిలో గణన తరువాత మరో రూ.564.83 కోట్లు పెరిగిందని అధికారులు వెల్లడించారు.