కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో నోటీసులను వైద్య ఆరోగ్య సిబ్బంది అంటిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్ చేశారు. ఇంటింటికీ ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్నారు. ముందుగానే…ప్రకటించిన హాట్‌స్పాట్‌ల వద్ద మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మరోవైపు కరోనాపై ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్దితిపై ఆయన ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తదనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదేశాలతో కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్నారు అధికారులు. కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో ఏపీలో అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది.(కరోనాపై పోరాటం చేద్ధాం: కార్యకర్తలతో ప్రధాని మోడీ)
లాక్‌డౌన్ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు అందాయి.అంతేకాక కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకెళుతున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసరాల కొనుగోలుకు సమయం కుదించారు. ఏదైనా అత్యవసర పనులు మినహా మిగిలిన సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఈ నిబంధనలు ధిక్కరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పాజిటివ్‌గా వెల్లడైన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు, అనుమానం ఉన్న వారిని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా, కరోనా బాధితులను కలిసి ఉండటం వంటి అంశాలతో హోమ్ క్వారంటైన్‌లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలించడమో చేస్తున్నారు. పాజిటివ్ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్నారు.
సర్వే ఆధారంగా జ్వరం, జలుబు, ఇతరత్రా వైరస్ లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి శాంపిల్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలుసుకుంటున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నారు. అనుమానితులు, పాజిటివ్ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక, అవసరాన్ని బట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత పరిధి వరకు హైపోక్లోరైడ్ స్ప్రేతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరుస్తున్నారు.