ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబానికి రూ.10లక్షల చెక్ ఇచ్చిన మంత్రి

  • Publish Date - November 2, 2020 / 11:55 AM IST

10 lakhs check to varalakshmi family: విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి(17) కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత సోమవారం(నవంబర్ 2,2020) పరామర్శించారు. రూ.10లక్షల చెక్ ని వారి కుటుంబానికి ఇచ్చారు. ప్రేమోన్మాది అఖిల్ సాయికి శిక్ష తప్పదని హోంమంత్రి అన్నారు. వరలక్ష్మి ఇంటికి వెళ్లిన హోంమంత్రి, అండగా ఉంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్ లను జగన్ ఆదేశించారు. విద్యార్ధినులంతా దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హోంశాఖ మంత్రి సుచరితకు ఫోన్ చేశారు జగన్.

మంత్రితో పాటు సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరలక్ష్మి కుటుంబానికి సంతాపం తెలిపిన సీఎం జగన్, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ చెక్ ను ఇవాళ హోంమంత్రి సుచరిత వరలక్ష్మి కుటుంబానికి ఇచ్చారు. గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం(అక్టోబర్ 31,2020) రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంటర్ విద్యార్ధిని వరలక్ష్మిని అఖిల్ సాయి(లా విద్యార్థా) అనే యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు.

ఆధారాల్లేకుండా కారం చల్లాడు, క్షుద్రపూజలు జరిగినట్లు సీన్‌ క్రియేట్‌ చేశాడు:

ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి(17) హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపించేలా అఖిల్‌ వరలక్ష్మి మర్డర్‌కు ప్లాన్‌ చేశాడు. పక్కా ప్రణాళికతో వరలక్ష్మిని చంపి కేసు తనపై రాకుండా ఉండేలా వ్యవహరించాడు. హత్య అనంతరం ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి.. పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలనే కోణంలో వ్యూహం సిద్ధం చేశాడు అఖిల్‌. లా చదివిన నిందితుడు తన తెలివిని నేర స్వభావానికి వాడుకున్నాడు. నమ్మి వచ్చిన యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. హత్య జరిగిన ప్రాంతంలో క్షుద్రపూజలు జరిగినట్లు సీన్‌ క్రియేట్‌ చేశాడు. పోలీసులే ఆశ్చర్యపోయేలా మర్డర్‌ ప్లాన్‌ ప్రిపేర్‌ చేశాడు అఖిల్‌.

పోలీసులే ఆశ్చర్యపోయేలా మర్డర్‌ ప్లాన్‌:
వరలక్ష్మిని హత్య చేసిన ప్రాంతమైన సాయిబాబా ఆలయానికి ప్రహరీ గోడ ఉంది. ఆ గోడ అవతలివైపు యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు అఖిల్‌. వరలక్ష్మీ రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉండగా… ఆధారాలు లేకుండా చేయడానికి తనతో తెచ్చుకున్న కారాన్ని ఆ ప్రదేశంలో చల్లాడు. అక్కడ హత్య కాదు క్షుద్రపూజలు జరిగినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. హత్యపై వివిధ అనుమానాలు రేకెత్తించడానికి రామ్‌ అనే వ్యక్తి అక్కడ ఉన్నట్లు పోలీసులకు కథ అల్లాడు. ఆ సమాచారం బయటకు రావడంతో రామ్‌, వరలక్ష్మి కలిసి ఉన్న సమయంలో తాను వచ్చి దాడి చేశాడని అంతా భావించేలా చేశాడు. నిందితుడిని తమ స్టైల్‌లో విచారణ జరిపిన పోలీసులు అందులో ఏమాత్రం నిజం లేదని గుర్తించారు.

7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌ షీట్‌ వేస్తాం:
గాజువాకలోని వరలక్ష్మి ఇంటికి వెళ్లిన హోంమంత్రి సుచరిత, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం ప్రేమోన్మాది అఖిల్‌.. వరలక్ష్మి గొంతు కోసి హత్య చేశాడు. హత్య కేసులో అఖిల్‌కు కోర్టు నవంబర్ 12 వరకు రిమాండ్‌ విధించింది. మహిళా భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దాడులు, హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు హోంమంత్రి సుచరిత. వరలక్ష్మి హత్య కేసులో 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌ షీట్‌ వేస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సుచరిత.

https://www.youtube.com/watch?v=3G2QDeq7znM