భార్య అక్రమ సంబంధం : కిరాతకంగా హత్య చేసిన భర్త

  • Publish Date - April 15, 2020 / 12:46 PM IST

తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి… నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్ పోసి హత్యచేశాడు ఒక భర్త. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం సాలూరులో ఈ ఘోరం చోటు చేసుకుంది. శంబరకు చెందిన బొర్రా పావనికి, తిరుపతిరావుతో 2011 లో వివాహం అయ్యింది. వివాహాం అయ్యాక భార్య భర్తలు చెన్నై వెళ్లి అక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లల చదువు కోసం  తిరుపతిరావు దంపతులు 2019లో సాలూరు తిరిగి వచ్చేశారు. 

భార్య పిల్లలను ఇక్కడే వదిలేసి తిరుపతి రావు తిరిగి చెన్నై వెళ్ళిపోయాడు. భర్త చెన్నై వెళ్లిన తర్వాత పావనికి  సాలూరులో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి కొన్ని ఫోటోలు దిగింది. ఇటీవల సాలూరు వచ్చిన తిరుపతిరావు భార్య ఫోన్ ను పరీశీలించాడు. భార్య  వేరే వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలను చూశాడు. కాల్ రికార్డింగ్ లో పావని ఆ వ్యక్తితో మాట్లాడిన మాటలు విని భార్యతో గొడవపడ్డాడు. 

ఈ విషయమై స్ధానిక పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పావని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దంపతులు మధ్య గొడవపై పెద్ద మనుషులు కూర్చుని రాజీ కుదిర్చి పావనిని మళ్ళీ భర్త వద్దకు పంపించారు. ఇటీవల కరోనా వైరస్ లాక్ డౌన్ అమలవుతుండటంతో మార్చి29 న, టైలరింగ్ నేర్చుకోటానికి బయటకు వెళతానని పావని భర్తను కోరింది.

భార్య ఇంటి నుంచి బయటకు వెళతానని అడగటంతో కోపంతో  ఊగిపోయిన తిరుపతి రావు భార్యతో గొడవ పడ్డాడు. భార్యపై దాడి చేసి..అనంతరం టీవి సౌండ్ పెద్దదిగా పెట్టి భార్యను మంచానికి కట్టేశాడు. అంతటితో ఆగక భార్య నోట్లో బాత్రూమ్ కడిగే యాసిడ్ పోశాడు. అనంతరం  ఏమీ తెలియనట్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

గొంతులో యాసిడ్ పడే సరికి పావని మరణించింది. కొతం సేపటి తర్వాత మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేసి భార్య ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించాడు తిరుపతిరావు. సమాచారం  తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పావని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తిరుపతిరావుపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.