KA Paul
KA Paul Criticized Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు చేశారు. 43 సంవత్సరాలుగా శాంతి దూతగా పని చేస్తున్నా.. ఇప్పటివరకు ఎవరినీ క్రిటిసైజ్ చేయలేదని కానీ ఇప్పుడు చేయాల్సివస్తుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బడుగు బలహీనవర్గాల కోసం పార్టీ పెట్టాను అన్నాడు.. కానీ మళ్ళీ అగ్ర కులాల కోసం పని చేస్తున్నాడని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ తన సలహాలు తీసుకుంటున్నాడు కానీ పూర్తి స్థాయి లో అమలు చేయటం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్.. ఆయనే సీఎం అని అంటున్నాడు.. టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ ఇన్ని పార్టీలతో పవన్ పొత్తులు పెట్టుకున్నావని పేర్కొన్నారు. గతంలో పొత్తులు వద్దని బయటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తులు ఎందుకని పవన్ ను ప్రశ్నించారు. పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడని తెలిపారు.
“నేనే సనాతన ధర్మం, చేగువేరా, నక్సలైట్, ఆర్ఎస్ఎస్ ఇలా పూటకో ధర్మం అంటున్నాడు.. అసలు నువ్వు ఏ ధర్మంను పాటిస్తున్నావు” అని కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ స్టార్ అని ఎద్దేవా చేశారు. “వంగవీటి రంగాను చంపిన వారితో నీకు పొత్తులు ఎందుకు” అని ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఒక్కసారి తప్పు చేస్తే.. పవన్ కళ్యాణ్ రోజూ తప్పు చేస్తున్నాడని విమర్శించారు.
“నా రియల్ హీరో మీరే అని నన్ను అన్న పవన్ కళ్యాణ్.. నా బాటలో ఎందుకు నడవడం లేదు” అని ప్రశ్నించారు. ఈ మేరకు కేఏ పాల్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ పవన్ కళ్యాణ్ ప్రజలను కన్ఫ్యూజన్ లోకి నెడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీని ఓడించడానికి టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
మతిస్థిమితం లేక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తే.. తాను పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తో ఉన్న తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు బయటికి వచ్చారని ప్రశ్నించారు.