Ramprasad Reddy: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కన్నీరు.. పిలిపించి మాట్లాడిన చంద్రబాబు..

విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి మార్చాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

Ramprasad Reddy: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కన్నీరు.. పిలిపించి మాట్లాడిన చంద్రబాబు..

Updated On : December 29, 2025 / 3:23 PM IST

Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది.

ఇప్పటివరకూ ఉన్న 26 జిల్లాల్లో అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పు జరిగింది. రాయచోటిని మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వే కోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

దీంతో 25 జిల్లాలకు పాత జిల్లాల కుదింపు జరగనుంది. కొత్తగా మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉండనున్నాయి. ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మార్పు నేపథ్యంలో క్యాబినెట్ నుంచి బయటికి వచ్చాక మీడియా ముందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత రాం ప్రసాద్ రెడ్డి తిరిగి సచివాలయానికి చేరుకున్నారు.

రాంప్రసాద్ రెడ్డితో చంద్రబాబు చర్చ

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడంతో ఆయనతో చంద్రబాబు మాట్లాడారు. అన్నమయ్య‌ జిల్లాకు రాయచోటి జిల్లా హెడ్ తొలగించి మదనపల్లికి మార్చడంపై వచ్చే ప్రతికూల పరిస్థితులపై రాంప్రసాద్ రెడ్డితో చంద్రబాబు చర్చించారు.

మంత్రివర్గం ముగిశాక వివిధ తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చ జరిపారు. విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి మార్చాల్సి వచ్చిందని అన్నారు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం రాం ప్రసాద్ రెడ్డి గట్టిగా పోరాడుతున్నారని ప్రశంసించారు.

రాజంపేట వాసులు కడపను కోరుకుంటుండడం, రైల్వే కోడూరు వాసులు తిరుపతి కోరుకుంటుండడంతో రాయచోటి మార్పు తప్పట్లేదని చంద్రబాబు చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే మార్పు తప్పలేదని వివరించారు.

అథోనీ 2 మండలాల ఏర్పాటు పైనా చర్చ సాగింది. 3 మండలాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించి 2 మండలాలకే పరిమితం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. నెల్లూరులో రెవెన్యూ డివిజన్ ఓ చోట, డీఎస్పీ పరిధి మరోచోట ఉండటంపై కొద్దిసేపు చర్చ జరిగింది. 2025లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు అన్నారు.