వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి.. తొలి 3 రోజులు వీరికి మాత్రమే అనుమతి.. భారీ భద్రత
ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
Vaikuntha Dwara Darshan: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రేపటినుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత నిత్య కైంకర్యాల అనంతరం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.
ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. రేపు, ఎల్లుండి, జనవరి 1న దర్శనానికి 1.89 లక్షల మంది భక్తులకు ఈ డిప్ ద్వారా టీటీడీ టోకెన్లు కేటాయించింది.
రేపటి నుంచి 3 రోజులు ఈ డిప్ టోకెన్ ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది. జనవరి 8 వరకు తిరుపతిలో టైం స్లాట్ దర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తారు.
జనవరి 2 నుంచి ఎటువంటి టోకెన్లు లేకుండా భక్తులను సర్వదర్శనానికి అనుమతి ఉంటుంది. టోకెన్లు లేకపోయినా ఈ రోజు, రేపు భారీగా భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
టోకెన్లులేని వారిని మూడు రోజులు దర్శనానికి అనుమతించడం లేదని విస్తృత ప్రచారం కల్పిస్తోంది. భక్తుల భద్రతకు 2 వేల మంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బందిని ఏర్పాటు చేసింది.
