Pawan Kalyan
Pawan Kalyan : ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఙతలు తెలిపారు. కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోదీ నూతన ఉత్తేజాన్ని అందించారని కొయానియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కల్యాణ్ కృతజ్ఙతలు తెలిపారు.
గత వారం యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఒప్పందం యూరప్ మార్కెట్లలో భారతీయ వస్తువులకు భారీ ప్రాధాన్యతను కల్పిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇది కేవలం వాణిజ్యమే కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తుందని పవన్ పేర్కొన్నారు. ఈయూ ఒప్పందం జరిగిన కొద్దిరోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కుదిరిన తాజా ఒప్పందం భారతీయ వ్యాపారులకు, ముఖ్యంగా రైతులకు వరప్రదాయినిగా మారనుందని పవన్ కల్యాణ్ అన్నారు.
సుంకాలు తగ్గిస్తానన్న ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన పవన్.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికా సుంకాలు 18శాతం తగ్గించడం రైతులకు గొప్ప వరం అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా కృతజ్ఙతలు తెలిపారు.
I extend my heartfelt congratulations to the Hon’ble Prime Minister Sri @narendramodi Ji, for energising India’s economy by concluding two world-class trade agreements within a span of a week.
Following last week’s landmark “mother of all deals” with the European Union, Bharat’s… https://t.co/d4TvZIGHGE
— Pawan Kalyan (@PawanKalyan) February 3, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్ లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం విధించిన టారిఫ్ లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనిపై ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడనని, ఆయన నాకు మంచి స్నేహితుడని చెప్పారు. అంతేకాదు శక్తిమంతమైన నాయకుడు అంటూ మోదీని కీర్తించారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేందుకు.. అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేయడానికి మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది అని ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
భారత్ పై ప్రతీకార టారిఫ్ లను 25శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్ద ధన్యవాదాలు” అని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.