Pawan Kalyan On TDP Alliance : నా ఆఫీసుకి రండి.. టీడీపీకి మద్దతుపై పవన్ కీలక వ్యాఖ్యలు.. శత్రువులతో కూడా కలుస్తాం, అదే రాజకీయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుపై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి జనసేన మద్దతు కావాలంటే తన ఆఫీసుకి రావాలని అన్నారు. తన నిర్ణయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు.

Pawan Kalyan On TDP Alliance : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుపై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి జనసేన మద్దతు కావాలంటే తన ఆఫీసుకి రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు పవన్. తనను టీడీపీ మనిషి అని అందరూ విమర్శిస్తూ ఉంటారని పవన్ అన్నారు. దీనిపై పవన్ వివరణ ఇచ్చారు. గతంలో జరిగిన తప్పు మళ్లీ జరగొద్దనే టీడీపీకి తాను సపోర్ట్ చేశానని వెల్లడించారు. నేను కన్ స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టపడతాను కానీ, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టపడను, సపోర్ట్ చేయను అన్నారు. తన నిర్ణయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు.

నాకు కుల పిచ్చి లేదు. కులం మీద మమకారం లేదు. మిగతా కులాలను గౌరవిస్తాను. అదే గౌరవం నా కులం మీదా ఉంది. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను రాలేదు. మీకు మా మద్దతు కావాలంటే మా ఆతిథ్యం స్వీకరించండి. మా ఆఫీసుకి రండి. అప్పుడే మా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. నేను పోటీ చేయకుండా టీడీపీకి ఓటు వేయాలంటే మీరు మా వాళ్లను గౌరవించాలి. లేదంటే ప్రయోజనం లేదు.

దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. ఏపీలోనూ మూడో ప్రత్యామ్నాయం అవసరం. ప్రజారాజ్యం పార్టీని తియ్యకుండా ఉండి ఉంటే ఏపీలో మూడో ప్రత్యామ్నాయం ఉండేది. మనం నిలబెట్టుకోలేక, అటు టీడీపీ కాంగ్రెస్ లను చేయనివ్వకపోతే చిన్న గందరగోళం ఏర్పడి తప్పు జరుగుతుంది. ఇవాళ మునుగోడులో కూడా జనసేన పోటీ చేయాలని జనసేన నాయకులు కోరుతున్నారు. అందులో వచ్చే ఓట్ల వల్ల మనకు ప్రయోజనం లేదు. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో తెలంగాణలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం. అంతేకానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వద్దు. కన్ స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఉండాలనే ఉద్దేశం ఉన్నవాడిని నేను.

తెలుగుదేశానికి కొమ్ము కాస్తావని అంటున్నారు. నాకు ఎవరితోనూ సంబంధం లేదు. రేపటి రోజున వైసీపీకి మద్దతిస్తే మీకు ఓకేనా? మేము విడిగా పోటీ చేస్తే అప్పుడు మీకు ఓకేనా? 2019లో మేము విడిగానే పోటీ చేశాం కదా. కలిసి పోటీ చేస్తామని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను కోరుకునేది ఒక్కటే.
ఇంత విధ్వంసపూరిత రాజకీయాలు చేస్తున్నప్పుడు రాజకీయాల్లో మన శత్రువులతో కూడా కలుస్తాం. అదే రాజకీయం. ఇందులో మాకు ఎటువంటి అనుమానాలకు తావులేదు. మా వాళ్లకు గౌరవం ఇవ్వని చోట నేను ముందుకు తీసుకెళ్లను. నా నిర్ణయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. 151 సీట్లు వచ్చిన మీరు అద్భుతమైన పాలన అందిస్తే ఓటు చీలనివ్వను అనే మాట నా నోటి నుంచి ఎందుకు వస్తుంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.