పార్టీపై దృష్టి సారించిన జనసేనాని….8 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరం

  • Publish Date - November 17, 2020 / 07:13 AM IST

pawan kalyan focused on the party : జనసేన అధినేత పార్టీపై దృష్టి పెట్టారు.. చాలా కాలంగా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించని పవన్ .. ఇవాళ, రేపు పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు. ఇందుకోసం దాదాపు 8 నెలల తరువాత ఏపీలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా ఉన్న పవన్ పార్టీ కోసం రెండు రోజులు కేటాయించారు.



జనసేనాని మళ్లీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇన్ని రోజులు సినిమా షూటింగ్స్‌ బిజీలోఉన్న ఆయన.. ఇవాళ మంగళగిరిలో కాలుపెట్టబోతున్నారు. మూడు సినిమాలకు సైన్‌ చేసి.. ప్రస్తుతం వకీల్‌సాబ్‌ షూటింగ్‌లో ఆయన బిజీబిజీగా ఉన్నారు. గడిచిన 8 నెలలుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పార్టీకి ఇన్నాళ్లు గ్యాప్‌ తీసుకున్న జనసేనాని ఇవాళ మంగళగిరిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.



ఇవాళ, రేపు జనసేన పార్టీ సమావేశాలు నిర్వహిస్తోంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరుగున్నాయి. జనసేన కొన్ని నెలల క్రితం క్రియాశీల సభ్యత్వ నమోదుకు పిలుపునిచ్చింది. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్‌, అనంతపురం నియోజకవర్గాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ నేపథ్యంనలో ఇవాళ , రేపు రెండు రోజులు పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ సభ్యత్వంతోపాటు…పార్టీ బలోపేతంపైనా ఈ రెండు రోజుల సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.



ఇవాళ ఉదయం 11 గంటలకు జనసేన సమావేశం ప్రారంభంకానుంది. క్రియాశీల పార్టీ సభ్యత్వం విజయవంతంగా పూర్తి చేసిన ఐదు నియోజకవర్గాల నేతలతో వకీల్‌సాబ్‌ సమావేశమవుతారు. క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తోన్న ఇన్సూరెన్స్‌ సౌకర్యానికి సంబంధించిన ధ్రువపత్రాలను కొందరు సభ్యలకు పవన్‌ అందజేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యక్రమాల రూపకల్పనపై చర్చించే అవకాశముంది.
https://10tv.in/new-tension-for-ysrcp-activists/
ఇక రేపు ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో పవన్‌ భేటీ అవుతారు. మరో 32 నియోజకవర్గాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన ఆ నియోజకవర్గ ఇంచార్జ్‌లతో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తారు. అనంతరం జనసేన సభ్యత్వ నమోదు కోసం ఐటీ విభాగం రూపొందించిన యాప్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను పరిశీలిస్తారు.పవన్‌తోపాటు.. ఈ సమావేశాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఇతర పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు