జగన్ సర్కార్ తనను వేధిస్తుందంటూ నెత్తీనోరూ బాదుకుంటున్న జేసీ దివాకర్‌రెడ్డి… బీజేపీకి దగ్గరవుతున్నారా? కమలం కండువా కప్పుకుని వేధింపుల తప్పించుకోవాలని ప్లాన్ చేశారా? జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం.. టీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగు కావాలన్న జేసీ కామెంట్స్ దేనికి సంకేతం?
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి… మరోసారి నోటికి పని చెప్పారు. ఈసారి ఏకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగు కావాలంటూ శాపం పెట్టారు. సొంత పార్టీ టీడీపీని కూడా వదలకుండా రీజినల్ పార్టీలన్నీ లేకుండా పోవాలంటూ తన మనసులో మాట బయటపెట్టారు. జేసీ నార్మల్‌గా నోటికొచ్చినట్లు మాట్లాడతారు. తన, పర తేడా లేకుండా ఎవర్నైనా ఒకేలా ట్రీట్ చేస్తారు. ఆయన స్టైల్ గురించి తెలిసిన వారెవరైనా ఇలాంటి వ్యాఖ్యల్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. కానీ.. ఈ కామెంట్స్‌కు ముందు బీజేపీ జాతీయ కార్యదర్శిని జేసీ కలవడమే పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారా అనే ఆసక్తి నెలకొంది.
ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే… జేసీ దివాకర్ రెడ్డి టెన్షన్ పడుతున్నారు. ఆయన అనుకున్నట్టే దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేయడం… గతంలో ఆయన ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయడం లాంటి చర్యలన్నీ మరింత వేడి పుట్టించాయి. దీంతో ఒక దశలో కంట్రోల్ తప్పిన జేసీ… టీడీపీ అధికారంలోకి వస్తే తన బూట్లు నాకే పోలీసుల్ని పెట్టుకుంటానంటూ చీప్‌గా కామెంట్ చేశారు. అసలే జేసీపై ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్న పోలీసులు… ఈసారి ఏకంగా కేసు పెట్టి పీఎస్‌కు పిలిపించారు. స్టేషన్ బెయిల్ కోసం అన్ని పత్రాలతో వెళ్లిన జేసీని… 8 గంటల పాటు స్టేషన్‌లోనే ఉంచేశారు పోలీసులు. ఆ తర్వాత పీఎస్ నుంచి బయటికొచ్చిన జేసీ… మరోసారి జగన్‌పై నోరు పారేసుకున్నారు.
తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ మరుసటి రోజే అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను కలిసి… జాతీయ పార్టీలకు జైకొట్టారు. నేషనల్ పార్టీలతో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని… జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. మళ్లీ.. తాను మాత్రం ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం టీడీపీని వదిలేది లేదంటూ మెలిక పెట్టారు. దీంతో అసలు జేసీ మనసులో ఏముంది? బీజేపీలో చేరడానికి స్కెచ్ వేశారా? కమలానికి జైకొడితే జగన్ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారా అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చలు నడుస్తున్నాయి.
* మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
* జాతీయ పార్టీలతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం
* జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలి
* టీడీపీ సహా ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కావాలి
* ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా: జేసీ
* బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను కలిసిన జేసీ
* జేసీ బీజేపీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను డిమాండ్ చేసిన చిరంజీవి