జేసీ దివాకర్‌రెడ్డి అంటేనే పాలిటిక్స్‌లో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. తనకేది అనిపిస్తే అది నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. అందులో రెండో ఆలోచనే ఉండదు. ఎవరికి ఏం చెప్పాలన్నా సంకోచం లేకుండా చెప్పేసి.. ఇక తన పని తాను చేసేశానని ఫీలైపోతారు.
ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాదు.. ఏకంగా పెద్ద క్లాసే తీసుకున్నారంటున్నారు. ఈ క్లాసు పార్టీకి చాలా ఉపయోగపడేదని చెబుతున్నారు. జనరల్‌గా తానే క్లాసు తీసుకోవడానికి చంద్రబాబు ఇష్టపడతారు. కానీ, చంద్రబాబుకే క్లాసు తీసుకున్నారంటే జేసీ మామూలోడు కాదని పార్టీలో డిస్కస్ చేసుకుంటున్నారు.
ప్రభుత్వం తప్పులు.. ప్రతిపక్షానికే మంచిది :
ఎదుటోళ్లు తప్పు చేస్తే.. ఒరేయ్ అబ్బాయ్ ఇది తప్పురా.. అట్లా చేయకూడదని చెప్పడం మనం చూస్తుంటాం. కానీ, రాజకీయాల్లో అట్టాంటివి చెల్లవన్నది జేసీ ఫీలింగ్. ఎందుకంటే అధికార పార్టీ ఎన్ని తప్పులు చేస్తే ప్రతిపక్షానికి అంత మంచిదని జేసీ దివాకర్‌రెడ్డి అంటారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో చాలా సేపు మాట్లాడిన జేసీ.. చక్కనైన క్లాసు తీసుకున్నారని అంటున్నారు.
జగన్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలల కాలమైంది.. ప్రభుత్వం అన్న తర్వాత తప్పులు చేయకుండా ఉండదు. అట్టా ప్రభుత్వం చేసే ప్రతి తప్పును సరిదిద్దేందుకు ప్రయత్నిస్తూ పోతే మొదటికే మోసం వస్తుందని జేసీ దివాకర్‌రెడ్డి అంటున్నారు. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు చాలా డిటెయిల్డ్‌గా వివరించి మరీ చెప్పారట.
తగ్గని రాజకీయ వేడి :
అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తుంటే మనం ఎందుకు చెప్పాలనేది జేసీ దివాకర్‌రెడ్డి ఉద్దేశం. ఎక్కువ తప్పులు చేస్తే వారికే నష్టం కదా? మనమెందుకు సరిదిద్దాలని టీడీపీలో నాయకులు అనుకుంటున్నారట. ఈ ఆలోచన మొదలవ్వడానికి జేసీ దివాకర్‌రెడ్డే కారణమంటున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు అవుతున్నా ఇంకా రాజకీయ వేడి మాత్రం చల్లారడం లేదు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయి.
ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టడంతో ఆరు నెలలపాటు జగన్ పాలనను జాగ్రత్తగా పరిశీలించాలని తెలుగుదేశంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ముందు అనుకున్నాయి. కానీ, సడన్‌గా వేగం అందుకోవలసి వచ్చింది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడటం, సిమెంట్, ఇనుము, ఇటుక వంటి అనుబంధ రంగాలు ఒక్కసారిగా దెబ్బయిపోవడంతో రాజకీయ పార్టీలన్నీ గొంతు విప్పడం మొదలుపెట్టాయి. ఇక తెలుగుదేశం పార్టీ అయితే ఒకడుగు ముందుకేసి ప్రభుత్వం చేపట్టే ప్రతి పని మీదా విమర్శలు చేయడం మొదలుపెట్టింది.
జనాల్లో ఇదే డిస్కషన్ :
వివాదాస్పదం అయిన జగన్ సర్కారు నిర్ణయాలపై చంద్రబాబు స్పందించడం మొదలుపెట్టారు. పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష, రాజధాని నిర్మాణాల నిలిపివేత వంటి అంశాలపై చంద్రబాబు తన స్టయిల్లో మాట్లాడుతూ వచ్చారు.
ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందని, ఇది మంచిది కాదని చెప్పడం మొదలుపెట్టారు. చివరకు అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టడడమే తన ఉద్దేశం అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. దీని మీద జనాల్లో కూడా డిస్కషన్ మొదలైంది. కాకపోతే ఇట్టా ప్రతి విషయాన్ని చంద్రబాబు ఎత్తి చూపడం పార్టీలో ఉన్న కొందరు నాయకులకే నచ్చడం లేదంట.
జగన్ ఎన్ని తప్పులు చేస్తే :
మొన్నా మధ్య శాసనసభ సమావేశాల టైమ్‌లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అధినేత చంద్రబాబుతో దాదాపు అరగంట మాట్లాడారు. తప్పులు ఎక్కువ చేయనివ్వండి. మీరెందుకు తొందరపడి చెబుతున్నారు? ఎన్ని తప్పులు చేస్తే అన్నీ చేయనివ్వండి. ఓటేసిన ప్రజలకు కూడా నొప్పి తెలియాలి కదా? అని చంద్రబాబుతో జేసీ అన్నారట.
అయినా, ఇక్కడ గ్రామాల్లో పరిస్థితి మీకర్థం కావడం లేదని, వైసీపీ వర్గాలు మీద మీదకి వస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాలు కొనగుతున్నాయని జేసీ చెప్పుకొచ్చారట. జగన్ ఎన్ని తప్పులు చేస్తే మనకు అంత మంచిదని కూడా చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశారట.
ఒకసారి జగన్‌ను గెలిపిస్తే ఏమవుతుందనుకున్న జనానికి ఇప్పటికే తలబొప్పి కట్టింది కాబట్టి.. ఇక జగన్ పాలన అర్థం కావాలంటే అట్టా వదిలేయడమే మంచిదని చంద్రబాబుతో అన్నారట. మీకు టైమ్ వచ్చినప్పుడు రంగంలోకి దిగితే బెటర్ అని చెప్పారట. మనకు 23 సీట్లిచ్చారు. వాళ్లకు 151 సీట్లిచ్చారు. బాధ్యత వాళ్ల మీదే ఉంది. సక్రమంగా పరిపాలించాల్సింది వైసీపీ వాళ్లేనని కచ్చితంగా చెప్పారట.
ఇవన్నీ చంద్రబాబు జాగ్రత్తగా వినేశారంట. అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలతో పాటే మనం కూడా వెయిట్ చేద్దామని జేసీ అన్నారట. ఈ టైమ్‌లో కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకని ఒక సెటైర్ కూడా వేశారని టీడీఎల్పీ వర్గాలు అంటున్నాయి.