×
Ad

Kakinada Blast: కాకినాడ భారీ పేలుడు ఘటన.. ప్రభుత్వానికి జగన్ కీలక డిమాండ్

భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని జగన్ అన్నారు.

  • Published On : February 28, 2026 / 08:01 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలి
  • బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలవుతున్నాయా లేదో చెక్ చేయాలి
  • భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
  • భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి

 

Kakinada Blast: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదో చెక్ చేయాలన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలన్నారు జగన్. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు జగన్.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి.

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో మొత్తం 50 మంది వర్కర్లు పని చేస్తున్నట్లు సమాచారం. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వేట్లపాలెంకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.