×
Ad

టీడీపీలో ఆ నేత రూటే సెపరేటు.. రాజీనామా అస్త్రంతో హడావుడి చేస్తున్న నేత

ఎవరికి వారే అన్నట్లుగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు.

Pilli Sathi Babu

Kakinada Rural: కాకినాడ రూరల్ టీడీపీలో పాలిటిక్స్‌ గమ్మత్తుగా మారాయి. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల తీరు ఎలా ఉన్నా..ఆ ఒక్క నేత వ్యవహారశైలే ఆసక్తికరంగా ఉంటోందట. సామాజిక వర్గం బలంతో పాలిటిక్స్‌లో వెలుగు వెలుగుతున్న ఆ నేత..ఎప్పటికప్పుడు రాజీనామా అస్త్రంతో అసలు సిసలు రాజకీయానికి తెరదీస్తున్నారట. పార్టీ తనకు కన్న తల్లి అంటూనే..పార్టీ పదవులు రాజీనామా చేస్తానంటూ అలజడి సృష్టించడం ఆ నేత నైజం అని చర్చించుకుంటున్నారు.

ఇంతకు ఎవరా నేత అంటే..కాకినాడ రూరల్ టీడీపీ నేత పిల్లి సత్తిబాబు అని అంటున్నారు పబ్లిక్. సామాజిక వర్గ బలంతో అధినేతకు కూడా అల్టిమేట్ జారీ చేయడం ఆ నేత స్లైట్ అంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు పార్టీ పదవులకి రాజీనామా చేస్తానంటూ మీడియా ముందుకు వచ్చిన నేత..ఇప్పటివరకు అన్నంత పని చేయకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఐదు సార్లు సీటు ఇచ్చి గౌరవించిన పార్టీని రాజీనామా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారంటూ సొంత పార్టీ నేతలే సదరు లీడర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.. (Kakinada Rural)

Also Read: అందుకే GHMCలో మున్సిపాలిటీల విలీనం? ప్రభుత్వ నిర్ణయంతో వాళ్లకు పరేషాన్

పార్టీ కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదంటూ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తానంటూ లేటెస్ట్‌గా మరోసారి రచ్చకెక్కారు ఆ సీనియర్ నేత. అయితే ఆయన రాజీనామా ప్రకటన కార్యకర్తల కోసమా..లేక సొంత ఎజెండా ఏమైనా ఉందా అన్న చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. ఇక్కడ శెట్టిబలిజ సామాజిక వర్గందే కీలక పాత్ర. అదే సామాజక వర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు.

పిల్లి అనంతలక్ష్మీకి ఐదు సార్లు పోటీ చేసే అవకాశం
టీడీపీ నుంచి పిల్లి సత్తిబాబు భార్య పిల్లి అనంతలక్ష్మీకి ఐదు సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అయితే తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం టీడీపీ పదవికి రాజీనామా. ఇప్పటివరకు పిల్లి సత్తిబాబు టీడీపీ పదవులకి నాలుగుసార్లు రాజీనామా చేసేందుకు మీడియా ముందుకు వచ్చారు. కూటమి పొత్తులో భాగంగా తనకు టికెట్ దక్కలేదని టీడీపీ ఫ్లెక్సీలు చింపేసి హల్‌చల్ చేశారు. ఇప్పుడు కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తానని పార్టీకే అల్టిమేటం జారీ చేశారు సత్తిబాబు.

కాకినాడ రూరల్ సీటును పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు. జనసేన తరఫున పంతం నానాజీ గెలిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ కాకినాడ కోఆర్డినేటర్‌గా పిల్లి సత్తిబాబును నియమించింది అధిష్టానం. నియోజవర్గంలో రెండు బలమైన సామాజిక వర్గాలు ఉండడంతో మరో సామాజిక వర్గానికి చెందిన కటకంశెట్టి ప్రభాకర్ అలియాస్ బాబీకి కో-కోఆర్డినేటర్ పదవి ఇచ్చింది. అంతా బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఇద్దరు కోఆర్డినేటర్ల మధ్య కోర్డినేషన్ మిస్‌ అయ్యింది.

ఎవరికి వారే అన్నట్లుగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. కాకినాడ రూరల్ అబ్జర్వర్‌గా ఉన్న శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు ఇద్దరి మధ్య కుదిర్చి..వారిధిలా పనిచేశారు. దాంతో నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి సత్తిబాబుకు పట్టు పెరుగుతూ వచ్చింది.

తన సొంత సామాజిక వర్గ కార్యకర్తలు కుడుపూడి సత్తిబాబుకు దగ్గరవుతున్నారనే గుబులు పిల్లి సత్తిబాబులో మొదలైందట. నియోజవర్గంలో ఒకపక్క ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, మరోపక్క అదే సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి సత్తిబాబు పనిచేస్తూ ముందుకు పోవడం, ఇంకో కోఆర్డినేటర్‌తో గ్యాప్‌..ఇలా అన్నీ అన్నీ ఒక్కసారిగా రావడంతో..పిల్లి సత్తిబాబు మరోసారి రాజీనామా అస్త్రాన్ని బయటికి తీశారన్న చర్చ జరుగుతోంది. పిల్లి సత్తిబాబు రాజీనామాల అల్టిమేటంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.