TDP MP Kesineni Nani
Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఎంపీ నిధులతో రూ.47.00 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ( Monditoka Jagan Mohan Rao) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని చేసిన కామెంట్స్ చర్చనీయంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు సహకరిస్తానని చెప్పారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమైతే బాగుంటుందని అన్నారు.
గత నాలుగేళ్లుగా నందిగామ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్సీ వెంటనే వెంటనే స్పందిస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. పార్టీలు వేరైనా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ప్రజాహితం కోరుకునే పార్టీ నాయకులు ఏ పార్టీ అయినా సరే పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలని అన్నారు.