Cm Chandrababu : సంక్షేమ పథకాల అమల్లో వివక్ష ఉండదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. వైసీపీకి ఓట్లు వేసిన వారికి పథకాలు అందకూడదని తాను చెప్పినట్లుగా ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని చంద్రబాబు ఆదేశించారు. అసలు వైసీపీ నేతలను దగ్గరికి కూడా రానివ్వద్దన్నారు చంద్రబాబు. మరోవైపు గ్రూపు రాజకీయాలు ఉండకూడదని టీడీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మూడు పార్టీల నేతలు కార్యకర్తలతో మమేకం అవుతూ ముందుకు వెళ్లాలని సూచించారాయన.
జిల్లా ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని చెప్పారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. సరైన వ్యక్తులకు సరైన పదవులు ఇస్తామని చంద్రబాబు మాటిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు త్వరలోనే ఛైర్మన్లను నియమిస్తామన్నారు.
Also Read : భయమా? సాఫ్ట్ కార్నరా? విజయసాయిరెడ్డిపై ఆచితూచి వైసీపీ రియాక్షన్ ఎందుకు..
పార్టీ కోసం కష్టపడ్డ వారి వివరాలను వీలైనంత త్వరగా అందించాలని నేతలకు సూచించారు చంద్రబాబు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దని, రెండేళ్ల పదవీ కాలం తర్వాత మిగిలిన వారికి కూడా అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు టీడీపీ అధినేత. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.