Kakinada Explosion: కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 23 మంది మృతి.. పంట పొలాల్లో ఎగిరిపడ్డ మృతదేహాలు
వేట్లపాలెంకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Kakinada Explosion Representative Image (Image Credit To Original Source)
- సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
- 23 మంది మృతి, 17 మందికి తీవ్ర గాయాలు
- బాణసంచా తయారీ కేంద్రంలో 50 మంది వర్కర్లు
Kakinada Explosion: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 మంది చనిపోయారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి.
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెబుతున్నారు.
బాణసంచా తయారీ కేంద్రంలో మొత్తం 50 మంది పని చేస్తున్నట్లు సమాచారం. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా విషాదం అలుముకుంది. వేట్లపాలెంకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
వేట్లపాలెం ప్రమాదంలో 23 మంది చనిపోయారని హోంమంత్రి అనిత తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు వైద్య బృందం కృషి చేస్తోందన్నారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిందని వెల్లడించారు. అందుబాటులో ఉన్న అన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను క్షేత్రస్థాయికి చేరుకుంటున్నాయన్నారు. ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ వేగవంతం చేశాయన్నారు.
