అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలిస్తున్నారనే దానిపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ వెల్లడించింది. కార్ల ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కియాను తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.
పరిశ్రమను తరలించడానికి ఎలాంటి చర్చలు జరపలేదని, భారత్‌లో దీర్ఘకాలికంగా కియా కార్లను ఉత్పత్తి చేసేందుకే అనంతపురంలో పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేసింది కియా యాజమాన్యం. కార్ల ఉత్పత్తికి పూర్తిస్థాయిలో ప్లాంట్ ఏర్పాటు చేశామని వెల్లడించింది.
మూడు రాజధానుల అంశం కొనసాగుతుండగానే తెరపైకి కియా మోటార్స్ తరలింపు అంశం కాక రేపుతోంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమౌతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ రాసిన కథనం ప్రకంపనలు సృష్టించింది.
దీనిపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను వైసీపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. పరిశ్రమను తరలించడం లేదని, జరుగుతున్న ప్రచారం వట్టిదేనని వెల్లడించింది. ఏపీలో ఉన్న తన 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి మార్చేందుకు కియా చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ సంచలన కథ రాసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వం, కియా మోటార్స్ స్పందించాయి.