ప్రముఖ కవి ఆత్మహత్య.. పురస్కారం అందుకుని ఢిల్లీ నుంచి వచ్చిన రోజే పరుగుల మందు తాగి…

తూర్పుగోదావరి జిల్లా కరప మండలం గురజనాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ బుధవారం(మార్చి 17,2021) రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 70ఏళ్లు.

తూర్పుగోదావరి జిల్లా కరప మండలం గురజనాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ బుధవారం(మార్చి 17,2021) రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 70ఏళ్లు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గురజనాపల్లికి చెందిన మద్దా సత్యనారాయణ మాజీ సైనికోద్యోగి. భారత వాయుసేనలో పని చేశారు. బుధవారం సాయంత్రం కుటుంబంలో వివాదం జరిగింది. క్షణికావేశానికి లోనైన మద్దా.. పురుగుల మందు తాగారు. ఆపస్మారకస్థితిలో ఉన్న ఆయనను కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.

మద్దాకు సాహిత్యంపై ఎంతో అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే తెలుగుభాషపై పట్టు సాధించి జ్ఞానచంద్రిక బాల సాహిత్య శతక కావ్యం, పెద్దల మాట చద్దిమూట, మద్దా వారి మణిపూసలు, తరువోజ, బధిరుడు, పదవులున్నోళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేడ్కర్‌, నల్లధనంపై వేటు వంటి ఎన్నో రచనలు చేశారు. ‘అక్షర సత్య’ స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశారు.

దళిత సాహిత్యంపై ఉన్న మక్కువతో రిటైర్మెంట్ తర్వాత పలు రచనలు చేశారు. ఆయన రచనలకు మెచ్చి పలు సంస్థలు అనేక అవార్డులతో సత్కరించాయి. కవిచంద్రగా పేరొందిన మద్దా సత్యనారాయణకు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన 36వ జాతీయ మహాసభలో దళిత సాహిత్య అకాడమీ అంబేడ్కర్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ అందజేసింది. ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం ఆయన గురజనాపల్లి చేరుకున్నారు. సాయంత్రం ఇంట్లో ఉండగా కుటుంబంలో ఏర్పడిన గొడవకు మనస్తాపంతో మద్దా పురుగుల మందు తాగినట్టు స్థానికులు తెలిపారు.

మద్దా మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మద్దా మరణ వార్త పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అంబేద్కరిస్టు, మానవతావాది. ఎవరికి కష్టమొచ్చినా ఆదుకునేవారని గ్రామస్తులు తెలిపారు. ఆయన పద్యం మీద పట్టు సాధించి పలు శతకాలు రచించారు. లఘు కవితలపై పుస్తకాన్ని తీసుకొచ్చారు. కవిచంద్ర, సాహితీరత్న, శతపద్య కంఠీరవ, సహస్ర కవి భూషణ వంటి బిరుదులు అందుకున్నారు. 2016లో గురజాడ తెలుగు కవిత పురస్కారం అందుకున్నారు. 2017లో నల్లధనంపై వేటు, చెల్లని వెయ్యి, 500 నోటు ద్విభాషా పద్య కావ్యం రచించిన పలువురు ప్రశంసలు అందుకున్నారు. ఆయన మృతికి పలువురు సాహితీవేత్తలు, దళిత సంఘాల నేతలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు