Denduluru Assembly Race Gurralu : ఆయన సూపర్ క్లాస్‌, ఈయన ఊర మాస్‌.. ఎన్నికల సమరంలో ఈసారి గెలుపెవరిది?

కూటమి పార్టీలో అంతా కలిసికట్టుగా పోరాడితే వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే చాన్స్‌ ఉందంటున్నారు పరిశీలకులు.

Denduluru Assembly Race Gurralu : ఒకరు మాస్‌… ఇంకొకరు క్లాస్‌… నేను డిక్టేటర్‌ని నన్నెవరూ డిక్టేట్‌ చేయలేరన్నది ఒకరి స్టైల్‌ అయితే…. ఎవరు ఏం చెప్పినా సావదానంగా వినడం… తనదైన స్టైల్‌లో నిర్ణయాలు తీసుకోవడం ఇంకొకరి నైజం… మొత్తానికి మాస్‌, క్లాస్‌ మధ్య క్రాస్‌ ఫైర్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటోంది.. గత ఎన్నికల్లో మాస్‌ లీడర్‌కి చెక్‌ చెప్పిన క్లాస్‌ లీడర్‌.. ఈ ఎన్నికల్లోనూ అదే స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. మరి క్లాస్‌ను మాస్‌ ఎలా ఎదుర్కొంటారు? ఈ క్లాస్‌, మాస్‌ ఫైట్‌లో విజేత ఎవరు?

దెందులూరులో హైవోల్టేజ్ పాలిటిక్స్..
ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉంటే.. ఏలూరు నగరం చుట్టూ ఉండే దెందులూరు నియోజకవర్గానికి మాత్రం విపరీతమైన క్రేజ్‌. రాష్ట్రంలోనే హైవోల్టేజ్‌ పాలిటిక్స్‌ నడిచే నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటి. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ మధ్య ఆధిపత్య పోరాటం పతాకస్థాయిలో ఉంటోంది. ఎన్నికల సమయంలోనే కాదు… సాధారణ రోజుల్లోనూ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం దుమ్మురేపుతుంటోంది. మాస్‌ లీడర్‌గా గుర్తింపు పొందిన చింతమనేని స్పీడ్‌కు క్లాస్‌గా చెక్‌ చెబుతుంటారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి…

కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ..
దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, నాయకత్వం మాత్రం ఒకే సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటోంది. పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే శాసనసభలో అడుగుపెట్టడం విశేషం. తొలుత కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న దెందులూరు.. ఆ తర్వాత టీడీపీ నేత చింతమనేని అడ్డాగా మారింది. ఇక గత ఎన్నికల్లో చింతమనేనిని మట్టికరిపించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియోజకవర్గంలో బలమైన పునాదులు వేసుకున్నారు.

కలిసొచ్చిన క్లీన్ ఇమేజ్…
ఏలూరు పట్టణానికి నలువైపులా విస్తరించి ఉంటుంది దెందులూరు నియోజకవర్గం. కొల్లేరు పరివాహక ప్రాంతంతోపాటు దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల 20 వేల 274 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా.. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి సుమారు 16 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయననే మళ్లీ బరిలోకి దింపారు సీఎం జగన్‌. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై క్లీన్‌ ఇమేజ్‌ ఉండటం, పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయించడంతో దెందులూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

చింతమనేని వివాదాలే అబ్బయ్య చౌదరికి అడ్వాంటేజ్‌..
గత ఎన్నికల్లో వరకు విదేశాల్లో ఉన్న అబ్బయ్య చౌదరి.. తన తండ్రి కొఠారు రామచంద్రరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తండ్రిని ఓడించిన చింతమనేనిపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్‌ తేదీకి కొద్ది రోజుల ముందు వచ్చిన అబ్బయ్య చౌదరి మంచి వాక్‌ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. అప్పటికే చింతమనేని ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడం అబ్బయ్య చౌదరికి అడ్వాంటేజ్‌గా మారింది. ఇక ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు చింతమనేని.

చింతమనేని వైఖరితో టీడీపీలో చికాకులు..
అయితే ఆయన మాటతీరు, స్వభావం ఏ మాత్రం మారకపోవడంతో చాలా మంది కేడర్‌.. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కూటమి పార్టీలతోనూ దురుసుగా ప్రవర్తిస్తుండటం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల కూటమి సమన్వయ సమావేశంలో తనను ఎవరూ మార్చలేరంటూ జనసేన మహిళా నేతను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన సీటు.. పోటీపైనా కొంత ప్రతిష్ఠంభన ఏర్పడింది. అయితే టీడీపీలో చింతమనేనిని మించిన మరో నేత లేకపోవడంతో మళ్లీ ఆయనకే టికెట్‌ ఇచ్చింది టీడీపీ. ఇక జిల్లా పార్టీలో యాక్టివ్‌గా ఉండే చింతమనేని…. దెందులూరుతోపాటు ఉమ్మడి జిల్లాలో 15 సీట్లు మూడు ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమాగా చెబుతున్నారు.

చింతమనేనితో వేగలేక..
జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. చింతమనేని నాయకత్వంతో వేగలేక.. స్థానిక నేతలు…. చింతమనేనిని ఏలూరు పార్లమెంట్‌ బరిలోకి దింపాలని ప్లాన్‌ చేశారు. అధిష్టానంపైనా ఒత్తిడి చేయడంతో హైకమాండ్‌ కూడా ఈ దిశగా ఆలోచన చేసింది. ఐతే చింతమనేని మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకే పోటీ చేస్తానంటూ కరాఖండీగా చెప్పడంతో చేసేది లేక అధిష్టానం టికెట్‌ ఖరారు చేసింది.

అభివృద్ధి పనులను నమ్ముకున్న వైసీపీ..
ఇలా దెందులూరు రేసులో మాస్‌ వర్సెస్‌ క్లాస్‌ పోటీ కనిపిస్తోంది. ఇద్దరూ జనం మధ్యే తిరుగుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు అబ్బయ్య చౌదరి చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయన్న ఆశతో వైసీపీ చాలా కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తోంది.

ఆశలన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే..
ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకున్న చింతమనేని సైతం విజయం పక్కా అంటున్నారు. కానీ, కూటమిలోని జనసేన, బీజేపీతోపాటు సొంత పార్టీలోని కొంతమంది నేతలు చింతమనేనికి సహకరిస్తారా? లేదా? అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీలో అంతా కలిసికట్టుగా పోరాడితే వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే చాన్స్‌ ఉందంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఇదే చింతమనేనికి సవాల్‌గా మారితే… క్లాస్‌గా పార్టీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి జోరు చూపిస్తున్నారంటున్నారు.

Also Read : 25ఏళ్ల అనుభవం వర్సెస్ 10ఏళ్ల రాజకీయ చాణక్యం.. గురుశిష్యుల సమరంలో విజేత ఎవరు?

 

ట్రెండింగ్ వార్తలు