ఆయన పెత్తనం మాకొద్దు.. కొవ్వూరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లకు కొత్త భయం

  • Publish Date - November 9, 2020 / 11:49 AM IST

jawahar

ks jawahar kovvur: పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 1989 నుంచి ఏడుసార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీయే గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌ ప్రభంజనం కొనసాగినా కొవ్వూరు ప్రజలు మాత్రం టీడీపీకే జైకొట్టారు. అంతటి బలమైన కేడర్ ఉండటంతో ఇక్కడ అంతర్గత రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రతి ఎన్నికల ముందు ఈ విభేదాలు కనిపించినా, ఇప్పటి వరకు గెలుపునకు అడ్డంకిగా మాత్రం మారలేదు. కానీ, ఇప్పుడు ఆ వర్గపోరు మాజీ మంత్రి జవహర్‌కు గట్టిగా తగులుతోందని అంటున్నారు.

సీనియర్ల పంచాయితీతో కొవ్వూరు నుంచి తిరువూరుకు జవహర్:
2019 ఎన్నికల ముందు మంత్రిగా ఉన్న జవహర్ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టేశారు. తాను మంత్రి అయ్యాక తయారు చేసుకున్న సొంత కేడర్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో జవహర్‌కు సీటు ఇవ్వొద్దంటూ చంద్రబాబు దగ్గర నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు పంచాయితీ పెట్టారు. దీంతో జవహర్‌ను కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు పంపించాల్సి వచ్చింది. కొవ్వూరు సీటును ప్రస్తుత తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితకు కేటాయించారు. ఆమె గెలుపు కోసం కేడర్ గట్టిగానే పని చేసింది. అయినా అనితకు ఓటమి తప్పలేదు.

జవహర్‌కు కొవ్వూరు బాధ్యతలు ఇవ్వొద్దని పట్టు:
తిరువూరులో జవహర్ కూడా ఓటమి చెందడంతో మెల్లగా కొవ్వూరు నియోజకవర్గంలో అడుగుపెట్టి కొత్త రాజకీయానికి తెర తీశారు. అప్పట్లో కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న అనితకు, జవహర్‌కు మధ్య అగ్గి రాజుకుంది. ఇంతలోనే అనిత పాయకరావుపేటకు తిరిగి వెళ్లిపోవడంతో కొవ్వూరులో జవహర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. కరోనా టైంలో కొవ్వూరులోనే తిష్టవేసి ప్రభుత్వంపై ఆందోళనలు చేసిన జవహర్.. నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తూ వచ్చారు. స్థానిక నాయకులు మాత్రం జవహర్‌కు బాధ్యతలు ఇవ్వొద్దంటూ పట్టుపట్టడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది.

టీడీపీ కార్యకర్తలకు కొత్త భయం:
జవహర్ మాత్రం నియోజకవర్గాన్ని వదలకపోవడంతో అధినేత చంద్రబాబు చేసేది లేక రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. కొవ్వూరు సెగ్మెంట్‌ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో మళ్లీ జవహర్ తన జోరు చూపించడం మొదలుపెట్టారని అంటున్నారు. కొవ్వూరులోని తన క్యాంప్ కార్యాలయం నుంచి రాజమండ్రి పార్లమెంట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. జవహర్ కొత్త బాధ్యతల నేపథ్యంలో ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గం నేతలకు, టీడీపీ కార్యకర్తలకు కొత్త భయం పట్టుకుందని టాక్‌.

జవహర్‌ నియామకంతో మళ్ళీ కొవ్వూరులో గ్రూపు రాజకీయాలు:
జవహర్‌ నియామకంతో మళ్ళీ కొవ్వూరులో గ్రూపు రాజకీయాలు తెరపైకి వచ్చాయట. గతంలో తమను వేధించిన జవహర్‌ను కొవ్వూరు నుంచి పంపించి వేసినా మరోసారి తమపై పెత్తనం చేయడానికి ఆయన వస్తున్నారని భావిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని నియోజకవర్గ నాయకులు చూస్తున్నారట. ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నాయకులు తెలుగు యువతతో రెండో వర్గం సమావేశం ఏర్పాటుచేసి, జవహర్‌కు రాజమండ్రి బాధ్యతలు అప్పగించినా కొవ్వూరు అసెంబ్లీ ఇన్‌చార్జిగా మాత్రం వద్దనే తీర్మానం చేసేశారు.

నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా టీడీపీ:
కొవ్వూరు టీడీపీ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య నేతృత్వంలో ఎవరిని నియమిస్తే వారితో తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, జవహర్ మాత్రం తమకొద్దని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. రాజమండ్రి ఇన్‌చార్జి అయిన తర్వాత మొదటి సారి కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చిన జవహర్‌కి తన గ్రూపు ఘన స్వాగతం పలికితే, రెండోగ్రూపు నాయకులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోవడంతో కార్యకర్తలు తమకు అండగా ఉండే నాయకులే కరవయ్యారని ఫీలైపోతున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.