జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం

  • Publish Date - December 10, 2020 / 12:52 PM IST

తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని మహిళలు జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకం “జగనన్న జీవక్రాంతి” ప్రారంభమైంది. ఈ పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన జగన్.. రూ.1,868.63 కోట్ల వ్యయంతో పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.



ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అముల్‌తో ఒప్పందం, జగనన్న జీవక్రాంతితో పాడిరైతులు, మహిళలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. పాడి రైతులు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జీవకాంత్రి పథకం ద్వారా 45-60 ఏళ్ల వయస్సులోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు గొర్రెలు, మేకలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాటు, బ్యాంకు రుణాన్ని ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.



తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మరో హామీని ఈరోజు నెరవేర్చామని, అక్కాచెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాధి, తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యమే ‘జగనన్న జీవక్రాంతి’ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా.. రైతుల్లో మరింత ఆర్ధిక అభివృద్ధి వస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని జగన్ చెప్పుకొచ్చారు. మహిళలకు ఆర్ధిక వనరులు పెరగాలని.. చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ.5,400 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు.



ఈ పథకాన్ని మూడు విడతలుగా.. మొదటి విడతలో 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడతలో 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడతలో 2021 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 99,000 యూనిట్లు.. ప్రకారంగా అమలు చేస్తారు.