×
Ad

Butta Renuka : వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్‌షాక్.. ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్ఐసీ

Butta Renuka : వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎల్ఐసీ బిగ్ షాకిచ్చింది. ఆమె ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది.

YSRCP former MP Butta Renuka

  • వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్‌ షాకిచ్చిన ఎల్ఐసీ
  • ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్
  • మార్చి 24న ఆస్తుల వేలంకు ప్రకటన జారీ

Butta Renuka : వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎల్ఐసీ బిగ్ షాకిచ్చింది. ఆమె ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఆస్తులను తనకాపెట్టి బుట్టా రేణుకా, ఆమె భర్త నీలకంఠ ఎల్ఐసీ నుంచి రూ.340 కోట్ల అప్పు తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీతో సహా రూ.782 కోట్లు అయ్యాయి. ఈ మేరకు ఎల్ఐసీ ఒక ప్రకటన విడుదల చేసింది. రుణ పరిష్కారం కోసం గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ, ఇరువర్గాల మధ్య ఎలాంటి ప్రత్యామ్నాయ ఒప్పందాలు కుదరకపోవడంతో ఎల్ఐసీ సంస్థ చివరకు వేలం ప్రక్రియను వేగవంతం చేసింది.

Also Read : FSL Fire Accident : ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు.. ఎన్ని ఫైల్స్ దగ్దమయ్యాయి.. ఫైల్స్ రికవరీపై ప్రత్యేక బృందం ఏమన్నదంటే?

హైదరాబాద్ కేపీహెచ్‌పీ కాలనీలో సర్వే నెంబర్ 1009లోని 3823 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయడానికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫైనాన్స్ బెంగళూరు బ్రాంచి అధికారిక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఆ స్థలంలో మెరీడియన్ స్కూల్ కొనసాగుతుంది. అయితే, మార్చి 24న ఈ స్థలాన్ని ఎల్ఐసీ వేలం వేయబోతోంది. మెరిడియన్ స్కూల్ ఉన్న ఆస్తి కనీసం విలువ రూ.65కోట్లుగా అధికారులు నిర్ణయించారు.

బుట్టా రేణుక 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. మళ్లీ 2019 ఎన్నికల సమయానికి తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నప్పటికీ.. ఆమెకు టికెట్ దక్కలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు. 2024 ఎన్నికల్లోనూ ఆమెకు ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ తరువాత ఆమె క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు.

బుట్టా రేణుక కుటుంబం కేవలం రాజకీయాల్లోనే కాకుండా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటిగా పేరుగాంచిన బుట్టా గ్రూప్ ను నిర్వహిస్తోంది. ఈ గ్రూపు పలు రంగాల్లో విస్తరించింది. విద్యారంగం, ఆటోమొబైల్ రంగం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇంకా పలు రంగాల్లో వీరికి పెద్దఎత్తున పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.