liquor bottles in durga temple board members car: విజయవాడ దుర్గగుడి పాలకమండలికి సభ్యత్వానికి చక్కా వెంకట నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. నిన్న(సెప్టెంబర్ 30,2020) నాగవరలక్ష్మి కారులో అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ చేసిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. లేఖను జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉయభానుకు పంపారు.
దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో మద్యం బాటిళ్లు:
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి వాహనంలో అక్రమ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బుధవారం(సెప్టెంబర్ 30,2020) పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి నివాసం దగ్గర సోదాలు చేయగా ఆమె వినియోగించే కారు (AP16BV 5577)లో 283 తెలంగాణ మద్యం సీసాలు గుర్తించినట్లు నందిగామ డీఎస్పీ తెలిపారు. నాగవరలక్ష్మి భర్త వెంకట కృష్ణప్రసాద్ తరచు తెలంగాణకు వెళ్లి మద్యం తీసుకొస్తున్నారని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌బాబుకు సమాచారం అందగా ఆయన ఆదేశం మేరకు పోలీసులు ఈ సోదాలు చేసినట్లు తెలిపారు. వెంకటకృష్ణప్రసాద్, కారు డ్రైవర్ శివపై కేసు నమోదు చేశారని వెల్లడించారు.
మాకు సంబంధం లేదు:
మరోవైపు పాలక మండలి సభ్యురాలు నాగవరలక్ష్మి ఒక వీడియో విడుదల చేశారు. తమ డ్రైవర్ కారులో ఇంధనం నింపుకొని వస్తామని తీసుకెళ్లారని, తర్వాత పోలీసులు వచ్చి పరిశీలిస్తే మద్యం దొరికిందని వివరించారు. మద్యానికి తమకు సంబంధం లేదని వీడియో సందేశంలో స్పష్టం చేశారు.
తరుచుగా తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణ:
తెలంగాణలోని మద్యం షాపుల్లో విక్రయించే మద్యం బ్రాండ్లు కారులో ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని మద్యం దుకాణాల్లో సరుకుని కొన్న తర్వాత జాతీయ రహదారి మీద నుంచి కాకుండా ఇతర పల్లెటూర్లలో నుంచి ఏపీలోకి మద్యాన్ని తరలించినట్టు పోలీసులు గుర్తించారు. జగ్గయ్యపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఏపీ 16 బీవీ 5577 నెంబర్ గల కారులో భారీ ఎత్తున మద్యం ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడ రైడ్ చేశారు. అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉన్న కారులో చెక్ చేయగా పెద్ద ఎత్తున మద్యం బయటపడింది.
ధర తక్కువ కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా మద్యం అక్రమ రవాణ:
ఏపీలో కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యాన్ని పరిమితం చేస్తామన్న వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు భారీగా పెంచారు. లాక్ డౌన్ సమయంలో కేంద్రం నుంచి మద్యం షాపులు తెరవడానికి అనుమతి వచ్చిన తర్వాత ఏకంగా మద్యం ధరలు 50 శాతం పెరిగాయి. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా భారీగా పెరిగింది. ఏపీ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో చాలా మంది అక్కడి నుంచి మద్యాన్ని అక్రమంగా తెస్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికి ఏపీ ఎక్సైజ్ శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది.
పాలకమండలి సభ్యురాలు కావడంతో కారు చెక్ చెయ్యడం లేదా?
సహజంగా ఏ ఆలయ పాలకమండలిలో అయినా అధికార పార్టీకి చెందిన నేతలే ఉంటారు. దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు అనే బోర్డు ఉండడంతో ఆ కారును పోలీసులు ఆపి ఉండకపోవచ్చనే వాదన ఉంది. అధికార పార్టీకి చెందిన వాళ్లే కదా అనే అభిప్రాయంతో పోలీసులు లైట్ తీసుకుని ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే అదనుగా ఏకంగా రూ.40వేల విలువైన మద్యాన్ని ఏపీలోకి తీసుకురాగలిగారు. విజయవాడలో ఓ విందు కోసం ఇంత భారీగా మద్యాన్ని తెచ్చారని సమాచారం.
అంతా ఆమెకు తెలిసే జరిగిందా?
పవిత్రమైన ఆలయానికి ట్రస్టు బోర్డు సభ్యురాలి కారులో మద్యం పట్టుబడడం, అది కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమంగా తరలించినట్టు గుర్తించడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి కూడా ఇరకాటంగా మారింది. కాగా, మద్యం తరలింపు విషయం ఆమెకు తెలిసే జరిగిందా? లేకపోతే ఆమె నేమ్ బోర్డు ఉన్న కారును వినియోగించి భార్యకు తెలియకుండా భర్త అక్రమంగా మద్యం తరలించారా? అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.